హైదరాబాద్ : బెట్టింగ్‌ ఆడొద్దన్న కన్న తండ్రి - దారుణంగా చంపేసిన 19 ఏళ్ల కొడుకు, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..!-son kills father over betting money in gachibowli ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైదరాబాద్ : బెట్టింగ్‌ ఆడొద్దన్న కన్న తండ్రి - దారుణంగా చంపేసిన 19 ఏళ్ల కొడుకు, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..!

హైదరాబాద్ : బెట్టింగ్‌ ఆడొద్దన్న కన్న తండ్రి - దారుణంగా చంపేసిన 19 ఏళ్ల కొడుకు, ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..!

బెట్టింగ్ ఆడొద్దని చెప్పినందుకు తండ్రి గొంతు కోసి కుమారుడు హత్య చేశాడు. ఈ దారుణ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తండ్రిని హత్య చేసిన కొడుకు

బెట్టింగ్ భూతానికి బానిసైన కుమారుడు… కన్న తండ్రిని చంపేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలో గచ్చిబౌలిలో వెలుగు చూసింది. తండ్రి గొంతులో కత్తితొ పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పైగా ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటికి వచ్చాయి.

బెట్టింగ్ యాప్ లో డబ్బులు…

ప్రాథమిక వివరాల ప్రకారం…. వనపర్తి జిల్లా ఘనపూర్‌ మండలానికి చెందిన కేతావత్‌ హనుమంతు (37) హైదరాబాద్ నగరానికి వలస వచ్చాడు. కుటుంబంతో కలిసి గోపనపల్లిలోని ఎన్టీఆర్‌నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం మేస్త్రీగా పని చేస్తున్నాడు. అవసరాల కోసం హనుమంతు రూ.6 లక్షల లోన్‌ తెచ్చాడు.

ఈ డబ్బులను గమనించిన పెద్ద కుమారుడు రవీందర్ నాయక్… ఈ డబ్బును బెట్టింగ్‌ యాప్‌లో పెట్టి పోగొట్టాడు. ఈ డబ్బు విషయంపై కుమారుడిని తండ్రి నిలదీశాడు. తీవ్రంగా మందలించటంతో… కన్న తండ్రిపై కుమారుడు కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని ప్లాన్ చేశాడు.

స్నేహితులు డబ్బులు ఇస్తారని చెప్పి జూలై 1వ తేదీన గోపనపల్లి పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తండ్రిని తీసుకెళ్లాడు. అక్కడ కత్తితో దాడి చేసి… గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత బంధువులకు ఫోన్ చేసి తండ్రి కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. ఆపై దహన సంస్కారాలు నిర్వహించేందుకు సొంత గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరిగాయి.

ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందగా సీన్ మారిపోయింది. అంత్యక్రియలు జరగకుండా ఆపేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. కుమారుడు రవీందర్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా… అసలు వాస్తవాలు బయటికి వచ్చాయి. తండ్రిని తానే చంపినట్లు రవీందర్‌ ఒప్పుకున్నాడు. దీంతో అతడిని రిమాండ్‌కు తరలించారు.

 

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.