Kamareddy Crime: కసాయి కొడుకు.. డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లినే చంపేశాడు
Kamareddy Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. డబ్బు కోసం ఓ వ్యక్తి కన్న తల్లినే చంపేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో.. ఆగ్రహానికి గురైన కుమారుడు కర్రతో కొట్టి తల్లిని చంపేశాడు. అతనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో దారుణం జరిగింది. తాను అడిగిన డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో కన్న తల్లినే కర్రతో కొట్టి హతమార్చాడు కుమారుడు. దుర్కి గ్రామంలో సాయిలు, అంజవ్వ దంపతులు ఉండేవారు. వారికి కూతురు సోని, కుమారుడు సాయికుమార్ ఉన్నారు. సోనికి కొన్నాళ్ల కిందట పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. కుమారుడు సాయికుమార్ తల్లిదండ్రులతో ఉంటున్నాడు.
కొద్ది రోజుల కిందట సాయిలు మృతి చెందారు. దీంతో అంజవ్వ కుమారుడు సాయికుమార్‌తో కలిసి ఉంటున్నారు. అయితే.. ఇటీవల సాయిలు మృతి చెందిన నేపథ్యంలో.. అంజవ్వకు రూ.5 రైతు బీమా డబ్బులు వచ్చాయి. వాటిల్లో లక్షన్నర వరకు అప్పులు కట్టింది. కుమార్తె సోనికి లక్ష రూపాయలు ఇచ్చింది. రెండు లక్షల రూపాయలను బ్యాంకులో డిపాజిట్ చేసింది. ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతున్న సాయికుమార్ ఆ డబ్బులపై కన్నేశాడు.
తనకు డబ్బులు కావాలని తరుచూ తల్లితో గొడవ పడుతున్నాడు. సోదరికి ఇచ్చినట్టే తనకూ ఇవ్వాలని అడిగేవాడు. దీంతో తల్లి అంజవ్వ అప్పుడప్పుడూ ఎంతో కొంత ఇచ్చేది. తాజాగా.. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.2 లక్షలు కూడా ఇవ్వాలని సాయికుమార్ తల్లితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో కోపంతో తల్లిని కర్రతో కొట్టాడు. అంజవ్వ అక్కడికక్కడే మృతిచెందారు. కూతురు సోనీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితుడు సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.