Medak District : రైతుబీమా డబ్బు కోసం దారుణం.. భార్యతో కలిసి తల్లిన హత్య చేసిన కొడుకు
Medak District Crime News : మెదక్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రైతు బీమా డబ్బుల కోసం ఆశపడి కన్నతల్లిని హత్య చేశాడు కుమారుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Medak District: డబ్బు వ్యామోహంలో పడి సొంత మనుషులనే దూరం చేసుకున్న సంఘటనలు ఎన్నో చూశాము. తాజాగా అదే తరహా ఘటన మెదక్ జిల్లాలో వెలుగు చూసంది. రైతు బీమా డబ్బుల కోసం తన సొంత తల్లినే హతమార్చాడు ఓ కుమారుడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.... పాపన్నపేట అన్నారం గ్రామములో ధనమొళ్ళ శంకరమ్మ (57) అనే మహిళ, తన కొడుకు కోడలుతో కలిసి ఉంటుంది. శంకరమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోయాడు. శంకరమ్మ కూలినాలి చేస్తూ తన ఇద్దరు కూతుర్ల పెళ్లి చేసింది. తన పేరుపైన 20 గుంటల వ్యవసాయ భూమి ఉండటంతో, తనకు రైతుబీమా కూడా ఉన్నది. శంకరమ్మ గ్రామంలోని మహిళా సంఘములో సభ్యురాలిగా ఉండడటం తో, అందులో కూడా తనకు బీమా ఉన్నది. తన ఒక్కగానొక్క కొడుకైన ప్రసాద్ కు కూడా కవిత అనే అమ్మాయితో పెళ్లి చేసి వారితో సుఖంగా జీవిస్తున్నది.
ఆటో తోలుకొని జీవించే కుమారుడు ప్రసాద్... కొంతకాలంగా మద్యానికి అలవాటు పడ్డాడు. ఆటో కూడా సరిగా నడపకపోవడంతో డబ్బులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ప్రసాద్ కు అప్పులు ఎక్కువ అయ్యాయి. ఇదే సమయంలో తన తల్లిని చంపితే బీమా డబ్బు వస్తుంది అనే దురాలోచన వచ్చింది. . ఇదే ఆలోచనను భార్యతో పంచుకోవడంతో.. ఆమె కూడా సహకరిస్తానని చెప్పింది. ఆగస్టు 28వ తేదీన రాత్రి ప్రసాద్, కవిత ఇద్దరు కలిసి శంకరమ్మను టవల్ తో ఉరివేసి చంపారు. పొద్దున్నే ఏమి తెలియనట్టు... ప్రసాద్ తన అక్కచెల్లెళ్లకి ఇద్దరికి ఫోన్ చేసి అమ్మ నిద్రలోనే చనిపోయింది అని చెప్పారు.
గ్రామంలో అందరికి కూడా ఇది సాధారణ మరణమే అని నమ్మబలికారు. కూతుర్లు ఇద్దరు వచ్చి, అంత్యక్రియలకి ఏర్పాటు చేస్తున్న క్రమంలో... శంకరమ్మ గొంతుపైన గాయమున్నటు గమనించారు. బంధువుల సహాయంతో వెంటనే పాపన్నపేట పోలీసులకు ఫోన్ చేశారు . పోలీసులు వచ్చి గట్టిగా ప్రశ్నించడం తో... ప్రసాద్, కవిత ఇద్దరు కూడా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. శంకరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం కి పంపారు. ప్రసాద్, కవితని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. బీమా డబ్బుకోసం తల్లిని చంపటం పాపన్నపేట మండలంలో పరిధిలో సంచలనంగా మారింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.