TG Private Hospitals : టెస్టులు చేయాల్సిందే.. అవసరం లేకున్నా మందులు తీసుకోవాల్సిందే!
TG Private Hospitals : తెలంగాణలోని పలు ఆస్పత్రుల తీరు రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. కొందరు డాక్టర్లు పేదలను దోపిడీ చేస్తున్నారు. డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆర్ఎంపీలతో కుమ్మక్కై కమీషన్లు దండుకుంటున్నారు. అవసరం టెస్టులు చేస్తున్నారు. మందులు అంటగడుతున్నారు.

ఇన్నాళ్లు డాక్టర్ల దగ్గరకు వెళ్తే రోగం నయం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వారు చేసే పనులు చూసి రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లో అడుగు పెట్టగానే రకరకాల పరీక్షలు చేయడం, అవసరం లేకున్నా మందులు రాయడం, ఆపరేషన్లు చేస్తూ దోపిడీ చేస్తున్నారు. దీంతో హెల్త్ కార్డు ఉన్నవారు, డబ్బున్న వారు మాత్రమే ఆసుపత్రులకు వెళ్లే పరిస్థితులు ఎర్పడ్డాయి.
ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే.. ఉన్న ఆస్తులు, అవయవాలు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు ప్రైవేట్ డాక్టర్లు కమీషన్లకు కక్కుర్తిపడి అవసరం లేకున్నా.. ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లకు పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం దోపిడీ చేస్తున్నారు. అటు పట్టించుకునే వారు లేక.. డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా ఎక్కువ రేట్లు వసూలు చేస్తూ.. డబ్బులు లాగేస్తున్నారు.
కమీషన్ల దందా..
ఉదాహరణకు.. ఒక రోగి ఆర్ఎంపీ దగ్గరకు వెళ్తే.. అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు. అందుకు సదరు ఆస్పత్రి వారు ఈ ఆర్ఎంపీకి కమీషన్ ఇస్తారు. అక్కడికి వెళ్లాక డాక్టర్ చూసి.. టెస్టులు రాస్తారు. సదరు డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లాలని సూచిస్తారు. ఆ డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులు ఈ డాక్టర్‌కు కమీషన్ ఇస్తారు. వచ్చాక మళ్లీ మందుల పేరుతో బాదేస్తారు. ఇలా ఆర్ఎంపీ దగ్గర్నుంచి మొదలుపెట్టి.. మెడికల్ షాపు వరకు నిలువు దోపిడీ చేస్తున్నారు.
చట్టం ప్రకారం..
మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం.. ప్రతి ఆస్పత్రిలో వైద్యుల ఫీజు, రోగ నిర్ధారణ పరీక్షల ఫీజుల వివరాలు రాసిన బోర్డులు పెట్టాలి. అవి రోగులకు కనిపించేలా ఉండాలి. అలా చేయని ఆసుపత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్ కేంద్రాలపై వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవచ్చు. కానీ అధిక చార్జీల వసూలు కట్టడి అంశం చట్టంలో లేదు. ఇది ప్రైవేట్ ఆస్పత్రులకు వరంగా మారింది.
మృతదేహానికి చికిత్స..
హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి డబ్బుల కోసం మరీ దిగజారిపోయింది. మృతదేహానికి ఏకంగా 2 రోజులు ట్రీట్‌మెంట్ చేశారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో.. మంత్రి దామోదర రాజనర్సింహా ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. దీంతో మదీనాగూడ సిద్ధార్థ ఆస్పత్రిలో అధికారులు తనిఖీలు చేశారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. ఇలా ఎన్నో ఆస్పత్రులు పేదలను దోచుకు తింటున్నాయి.