TG Women : తెలంగాణ మహిళలకు గుడ్‌న్యూస్.. ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం!
TG Women : తెలంగాణ మహిళలకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. వీటి ద్వారా ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని.. ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్వయం సహాయక సంఘాలకు వేయి మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని.. మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి సీతక్క ఆదేశాలతో ఇంధన కార్యదర్శికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది కార్యదర్శి లోకేష్ కుమార్ ప్రతిపాదనలు పంపారు.
మహిళా సంఘాలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా.. వేయి మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌లను కేటాయించాలని విజ్నప్తి చేశారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయిస్తే.. అనువైన భూములను గుర్తించి సంఘాలకు, సమాఖ్యలకు భూములను లీజుకు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను కేటాయించడం ద్వారా.. గ్రామీణ అతివల ఆర్థిక అభ్యున్నతికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఒక్క మెగా వాట్ ప్లాంటుకు రూ.3 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 10 శాతం మహిళా సంఘాలు ఇస్తే.. చేస్తే 90 శాతం బ్యాంకు ద్వారా లోన్లు మంజూరు చేయించాలని భావిస్తున్నారు. ఇంధన శాఖ అనుమతి ఇస్తే.. వారంలోపు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్క మెగా వాట్ ఉత్పత్తిపై ఏడాదికి రూ.30 లక్షల ఆదాయం వస్తుందని అంచనా అధికారులు వేస్తున్నారు.
మహిళలను ఆర్దికంగా బలోపేతం చేసేందుకు.. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి సీతక్క చొరవతో మహిళా సంఘాల కోసం 17 వ్యాపారాలను గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు యూనిఫామ్ కుట్టుడం, మహిళా శక్తి క్యాంటిన్లతో పాటు పలు రకాల వ్యాపారాలను మహిళా సంఘాల సభ్యులతో చేయిస్తున్నారు. బ్యాంక్ లింకేజ్ ద్వారా వడ్డీలేని రుణాలు ఇస్తూ.. మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రొత్సహిస్తుంది. ఇవే కాకుండా.. త్వరలో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
'గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది. శుక్రవారం ప్రజాభవన్‌లో అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాలకు ఫెడరేషన్ల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున సోలార్ పవర్ ఉత్పత్తికి త్వరతిగతిన చర్యలు ప్రారంభించాలని ఆదేశించాను. అందుకు అవసరమైన స్థలాలను సేకరించి స్వయం సహాయక సంఘాలకు లీజుకు ఇవ్వడం, సోలార్ పవర్ ఉత్పత్తికి అవసరమైన ఆర్థిక నిధులు సమకూర్చాలని బ్యాంకర్లతో సమావేశమయ్యాం. రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తున్నాం' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ట్వీట్ చేశారు.