Sangareddy : మృత్యువులోనూ వీడని స్నేహం..! దర్గాకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి-six youth from narayankhed killed in road accident near pune in maharashtra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy : మృత్యువులోనూ వీడని స్నేహం..! దర్గాకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

Sangareddy : మృత్యువులోనూ వీడని స్నేహం..! దర్గాకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

HT Telugu Desk HT Telugu
Jul 03, 2024 02:33 PM IST

Road Accident in Pune : అజ్మీరా దర్గాకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటన మహారాష్ట్ర పరిధిలో జరిగింది. మృతులంతా సంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

అజ్మీరా దర్గాకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
అజ్మీరా దర్గాకు వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన చిన్ననాటి స్నేహితులంతా కలిసి అజ్మీరా దర్గాను సందర్శించడానికి వెళ్లారు . తిరుగు ప్రయాణంలో వీరి వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది.  ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి మరణంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

దర్గాకు వెళ్లొస్తూ..…

వివరాల్లోకి వెళ్తే…. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మహబూబ్ ఖురేషి, రఫీక్ ఖురేషి, ఫిరోజ్ ,సయ్యద్ అమర్,సంగారెడ్డి జిల్లా కాంగ్జికి చెందిన ఫిరోజ్,హైదరాబాద్ బోరబండకు చెందిన ఇస్మాయిల్ అనే ఆరుగురు స్నేహితులు కలిసి ఆదివారం కారులో రాజస్థాన్ అజ్మీరా దర్గాను సందర్శించడానికి వెళ్లారు. వీరంతా పర్యటనను ముగించుకొని మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. 

వీరు ప్రయాణిస్తున్న కారు పూణె సమీపంలోకి రాగానే అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా అతడు పూణెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. వీరంతా 30 ఏళ్లలోపు వారే. ఈ ప్రమాద సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

నెల రోజుల కిందటే రాక…

నారాయణఖేడ్ పట్టణానికి చెందిన మహ్మద్ ఖురేషి సౌదీ అరేబియాలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. తండ్రికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స చేయించేందుకు నెల రోజుల కిందట నారాయణఖేడ్ వచ్చాడు. 

ఈ క్రమంలోనే మిత్రులతో కలిసి యాత్రకు వెళ్లి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందాడు. దీంతో అతని తల్లితండ్రులు బోరున విలపిస్తున్నారు. మిగిలిన స్నేహితులు చిన్న,చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. 

మరోవైపు ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మెదక్ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండకు చెందిన ప్రేమ్ కుమార్ తల్లి ప్రమీలతో కలిసి ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వెళ్తున్నారు. 

ఈ క్రమంలోనే మాచవరం వరకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బండిని వెనక నుండి వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రేమ్ కుమార్ కింద పడగా లారి టైర్ అతని తలపై నుండి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి ప్రమీలకు గాయాలయ్యాయి. 

ఈ సంఘటనను చుసిన వారు వెంటనే 108 కు సమాచారాన్ని అందించారు. దీంతో వెంటనే అంబులెన్సు వచ్చి వారిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి కళ్ళముందే కుమారుడు మృతి చెందడంతో ఆమె బోరున విలపిస్తోంది. తల్లి ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రిపోర్టింగ్ - ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, HT తెలుగు.

Whats_app_banner