ఆదిలాబాద్ జిల్లాలో విషాదం - పిడుగులు పడి ఆరుగురు మృతి..!-six people died in lightning strikes in several parts of adilabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఆదిలాబాద్ జిల్లాలో విషాదం - పిడుగులు పడి ఆరుగురు మృతి..!

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం - పిడుగులు పడి ఆరుగురు మృతి..!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ లో జిల్లాలో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. వేర్వురు చోట్ల పిడిగులు పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో విషాదం....!

తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్లు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వేర్వురు చోట్ల పిడుగులు పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. వీరిని వ్యవసాయ పనులు చేసుకునే కూలీలుగా గుర్తించారు.

నలుగురు కూలీలు మృతి…!

ఏజెన్సీ ప్రాంత పరిధిలోని పిప్పిరిలో పిడుగుపాటు ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రాథమిక వివరాల ప్రకారం…. పలువురు కూలీలు విత్తనాలు వేసే క్రమంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చింది. ఈ క్రమంలో వారంతా పక్కన ఉన్న గుడిసెలోకి వెళ్లారు. అదే సమయంలో గుడిసెపై పిడుగు పడింది.ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెెందారు. మరికొందరిని రిమ్స్ కు తరలించారు.

మరో ఘటనలో ఇద్దరు మృతి…!

బేల మండలం పరిధిలోనూ పిడుగులు పడ్డాయి. వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుపాట్లకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. పొలం పనులు చేస్తుండగానే ఈ ఘటన జరిగింది. కూలీ పనులకు వెళ్లిన వారు… అనంతలోకాలకు వెళ్లిపోవటంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు:

రాష్ట్రవ్యాప్తంగానూ మరో మూడు నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు(జూన్ 13) నిర్మల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చు. గంటలకు 40 - 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఎల్లుండి(జూన్ 14) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.