నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు పార్టీ సభ్యులు కాగా… ఇద్దరు మిలీషియా సభ్యులు, ఒక మహిళ ఉన్నారు. వీరంతా హింసను విడనాడి జన జీవన స్రవంతిలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ వెల్లడించారు.
సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ల సహకారంతో జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న కమ్యూనిటీ ఔట్ రీచ్ కార్యక్రమం "ఆపరేషన్ చేయుత" కింద వీరికి పునారావసం కల్పించనున్నారు. ఈ కార్యక్రమం కింద చేపడుతున్న కార్యక్రమాలకు మావోయిస్టులు…ఆకర్షితులవుతున్నారని పోలీసులు తెలిపారు.
ఈ లొంగుబాటుతో ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం పోలీసుల ముందు ఆయుధాలు సమర్పించిన మావోయిస్టుల సంఖ్య 326కు చేరుకుంది. డివిసిఎంలు, ఎసిఎంలు, పార్టీ సభ్యులు మరియు మిలీషియా సభ్యులతో సహా వివిధ ర్యాంకుల నుంచి వచ్చిన వారు ఇందులో ఉన్నారు.
గత ఏడాది ముగ్గురు సీనియర్ మావోయిస్టు స్టేట్ కమిటీ సభ్యులు లొంగిపోయారని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గుర్తు చేశారు. వీరికి పునరావాస ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్కరికి రూ .20 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. ఆయుధాలను విడిచి జనజీవన స్రవంతిలోకి వస్తే…వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం, పోలీసు శాఖ కట్టుబడి ఉంటుందని ఉద్ఘాటించారు.
లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులకు తక్షణ సహాయంగా రూ .25,000 అందుతాయి. మిగిలిన ఆర్థిక సహాయం, వారి ర్యాంకుల ఆధారంగా, వారి ఆధార్ మరియు బ్యాంకు వివరాలను సమర్పించిన తర్వాత బదిలీ చేయబడుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ వివరించారు.
సంబంధిత కథనం