Fire Accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చెలరేగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాంప్లెక్స్‌లో నిర్వహిస్తున్న కాల్ సెంటర్‌లో పని చేస్తున్న వారు మంటలు చెలరేగిన వెంటనే తప్పించుకునే మార్గం లేకపోవడంతో ఓ గదిలో దాక్కున్నారు. మంటల తీవ్రతతో పాటు పొగకు ఉక్కిరిబిక్కిరైన వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసిన తర్వాత ఫైర్, రెస్క్యూ సిబ్బంది భవనాన్ని తనిఖీ చేస్తుండగా ఓ గదిలో ఆరుగురు స్పృహ కోల్పోయి ఉండటన్ని గుర్తించారు. వారికి సిపిఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.,ఎనిమిది అంతస్తుల్లో ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ ఏడో అంతస్తులో మొదట మంటలు వెలువడ్డాయి. అవి క్రమంగా నాలుగో అంతస్తు వరకు విస్తరించాయి. ఐదో అంతస్తులో పేలుడు జరగడంతో మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వస్త్ర దుకాణాలతో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు, కాల్ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు ఉన్నాయి. దీంతో నిత్యం రద్దీగా ఉంటుంది. మంటలు చెలరేగిన వెంటనే కాంప్లెక్స్‌లో పనిచేసే వారు, షాపింగ్ కోసం వచ్చిన వారు వెంటనే కిందకు దిగిపోయారు. ఈ క్రమంలో ఐదో అంతస్తులో పేలుళ్లతో కొందరు కిందకు రాలేకపోయారు. భవనంలో 15మందికి పైగా చిక్కుకుని పోవడంతో వారిని క్రేన్ల సాయంతో కిందకు దించారు. ,మంటలు అదుపు చేసిన తర్వాత ఓ గదిలో పడి ఉన్న ఆరుగురుని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రమీల, మర్రిపల్లికి చెందిన వెన్నెల, నర్సంపేటకు చెందిన శ్రావణి, ఖమ్మంజిల్లా నేలకొండపల్లికి చెందిన త్రివేణి, నర్సంపేటకు చెందిన శివలు చనిపోయారు. వీరంతా 22ఏళ్ళలోపు వయసు ఉన్నవారే. అపోలో ఆస్పత్రిలో కేసముద్రంకు చెందిన ప్రశాంత్ అనే యువకుడు చనిపోయాడు. మృతుల్లో ముగ్గురు వరంగల్ జిల్లాకు చెందిన వారు ఉన్నారు. ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందిన వారు కాగా ఒకరు మహబూబాబాద్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ,అగ్నిప్రమాదంలో పొగలో చిక్కుకున్న శ్రావణ్, భారతమ్మ, సుధీర్ రెడ్డి, పవన్, దయాకర్, గంగయ్య, రవిలను అగ్నిమాపక సిబ్బంది సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించడంతో కోలుకున్నారు. పొగలో చిక్కుకున్న వారు ప్రమాదం జరిగిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లు చూపిస్తూ కాపాడమని వేడుకోవడం కిందకు కనిపించింది. ఆ తర్వాత వారు అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది హైడ్రాలిక్ క్రేన్లలో ప్రాణాలకు తెగించి పైకి వెళ్లి వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని బయటకు తీసినా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఆస్పత్రిలో సహచరులు కన్నీరు మున్నీరయ్యారు. బిఎం5 కాల్ సెంటర్‌లోనే ఎక్కువమంది చిక్కుకుపోయినట్లు గుర్తించారు.,ప్రమాదం జరిగిన స్వప్నలోక్ కాంప్లెక్స్ రెండు బ్లాకుల్లో నిర్మించారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనంలో 400దుకాణాలు ఉన్నాయి. నిత్యం ఉదయం 10 నుంచి రాత్రి పది వరకు రద్దీగా ఉంటుంది. కాంప్లెక్స్‌లో దాదాపు 3వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. సెల్లార్, గ్రౌండ్, మొదటి అంతస్తుల్లోనే 170 దుకాణాలు ఉన్నాయి. ప్రమాదం జరిగే సమయానికి 5 నుంచి ఏడు అంతస్తుల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల సిబ్బంది వెళ్లిపోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. కాంప్లెక్స్ రెండు బ్లాకుల మధ్య దూరం కూడా మంటలు విస్తరించకుండా అడ్డుకున్నాయని చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు