Paper Leak Case : TSPSC కార్యదర్శి, సభ్యుడికి సిట్ నోటీసులు, త్వరలో వారికి కూడా!
TSPSC Paper Leak Case Updates: పేపర్ లీక్ కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్… తాజాగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శితో పాటు ఒక సభ్యుడికి నోటీసులు జారీ చేసింది.
SIT notices to TSPSC officials: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్స్(TSPSC Paper Leak) వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా... మరికొందరిని విచారిస్తోంది. తవ్వేకొద్ది అక్రమాలు బయటికి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ తో పాటు మెంబర్ లింగారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది. వీరి నుంచి పలు వివరాలను సేకరించే ఆలోచనలో ఉంది సిట్.
ఈ లీకేజీ కేసులో కార్యదర్శి పీఏ ప్రవీణ్‌కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ ఇద్దరిని విచారించడంతో మాజీ ఉద్యోగి ప్రవీణ్, అందులో పనిచేసే రమేష్, షమీమ్‌లు కూడా బయటికి వచ్చారు. కమిషన్ సభ్యుడు బండి లింగారెడ్డికి పీఏగా రమేశ్ పని చేశారు. ఫలితంగా కార్యదర్శితో పాటు కమిషన్ సభ్యుడికి నోటీసులు జారీ చేసింది సిట్. వీరిద్దర్నీ విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో కమిషన్ ఛైర్మన్ తో పాటు ఇతర సభ్యులకు కూడా నోటీసులు జారీ చేసి విచారించాలని సిట్ భావిస్తోంది. కమిషన్ లో ఉద్యోగాలు విధులు, విధివిధానాలు, నిర్వర్తించే బాధ్యతల కూడా ఆరా తీసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... తెలంగాణ కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా ఈడీకి గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతలతో కలిసి ఫిర్యాదును ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.... టీఎస్పీఎస్సీ దొంగలకు, దోపీడీదారులకు, అవినీతిపరులకు అడ్డాగా మారిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలోఆశ్రిత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని... లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. వందలాది మంది నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయినా కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్లు కూడా లేదని దుయ్యబట్టారు. కేసుతో లింక్ ఉన్న ప్రభుత్వ పెద్దలను అమరవీరుల స్థూపం ముందు ఉరేసినా తప్పులేదని వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా నిరుద్యోగులకు కేటీఆర్ క్షమాపణ చెప్పి పారదర్శక విచారణ చేయిస్తారనుకున్నామని... కానీ సిట్ తో కేసులు వేయించి విద్యార్థి నాయకులను నిర్బంధించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేపర్ లీకేజ్ లో శంకరలక్ష్మి దగ్గర నుంచి నేరం మొదలైందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఏ1 గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మన్, సెక్రెటరీలను పెట్టాలని డిమాండ్ చేశారు. కేసులో కావాల్సిన వారిని కాపాడి చిన్న ఉద్యోగులను బలిచేసే ప్రయత్నం చేస్తున్నారని... ఈ అంశంపై మేం ఇప్పటికే కోర్టును ఆశ్రయించామని చెప్పారు. కోర్టులో కేసు విచారణ జరుగుతోందన్నారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపించేలా... ఈడీ జాయింట్ డైరెక్టర్ ను కలిసి పిర్యాదు చేశామని తెలిపారు. 420, 120బీ సెక్షన్లు ఈడీ పరిధిలోకి వస్తాయన్న రేవంత్ రెడ్డి.... కేటీఆర్ తో సహా టీఎస్పీఎస్సీ అధికారులందరినీ విచారించాలని కోరినట్లు పేర్కొన్నారు.
సంబంధిత కథనం