Siddipet Crime: సిద్దిపేట లో దారుణం ఆస్తి కోసం తమ్ముణ్ణి చంపిన అక్క, బావ.. ఐదుగురి అరెస్ట్
Siddipet Crime: మూడు ఎకరాల భూమి కోసం సొంత తమ్ముడిని అక్క, ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి చంపిన సిద్దిపేట జిల్లాలో వెలుగు చూసింది. ఈ నెల 7న సిద్దిపేట జిల్లాలోని సేలంపు గ్రామ శివారులో రోడ్డు పై అనుమానాస్పదంగా మృతి చెందిన ఆకునూరు గ్రామస్థుడు, దొండకాయల కనకయ్యది (54) హత్యగా తెలిసింది.

Siddipet Crime: ఆస్తి కోసం సొంత అక్క, బావలే కిరాతకంగా హత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేటలో వెలుగు చూసింది. ఆకునూరు గ్రామానికి చెందిన దొండకాయల కనకయ్యకు ఇద్దరు తమ్ముళ్ళు, ఒక అక్క ఉన్నారు. తల్లిని సరిగా చూడడం లేదని కనకయ్య అక్క అబ్బు యాదవ్వ (58) తల్లి బాగోగులు చూసుకుంటూ తల్లి పేరున ఉన్న భూమిని తన సోదరులకు తెలియకుండా 3 ఎకరాల 03 గుంటల భూమి తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నది.
ఈ విషయం తెలిసిన తమ్ముళ్లు తమకు వేరే జీవనధారం లేక భూమిని తిరిగి ఇవ్వమని అడిగినా కూడా పట్టించుకోకుండా ఆ భూమిని యాదవ్వ తన భర్త లింగంతో కలిసి మరొకరికి అమ్మేసింది. భూమి కొన్నవారు అందులో రాళ్లు పాతుకోవడానికి వెళ్లినపుడు యాదవ్వ తమ్ముళ్లు వారిని అడ్డుకోవడంతో పెద్ద తమ్ముడైన కనకయ్య పై అక్కా, బావలు కక్ష పెంచుకున్నారు.
అంతా కలిసి అంతమొదించారు..
ఫిబ్రవరి 6 సాయంత్రం మర్పడగ గ్రామంలో ఉన్న అక్క యాదవ్వ కూతురు కవిత దగ్గరకు వెళ్ళి భూమి విషయమై ఆమెతో మాట్లాడుతుండగా కవిత తన తండ్రి లింగం, తమ్ముడు కృష్ణమూర్తికి ఫోన్ లో సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో కవిత, యాదవ్వ కనకయ్యను మాటల్లో పెట్టి దోమలోనిపల్లిలో గల వ్యవసాయ బావి వద్దకు తీసుకవెళ్ళారు.
అక్కడ మాట్లాతున్న క్రమంలో యాదవ్వ కొడుకు కృష్ణమూర్తి కోపంతో కనకయ్యను కట్టెతో తల వెనుక భాగంలో కొట్టగా అతను స్పృహ తప్పిపడిపోయాడు. అదే అదునుగా భావించి తాడుతో ఊపిరాడకుండా చేసి చంపి అనుమానం రాకుండా అక్కడే ఉన్న మామిడి చెట్టుకు వ్రేలాడదీశారు.
ఎవరికి అనుమానం రాకూడదనే ఉద్దేశ్యంతో అర్దరాత్రి శవాన్ని దించి అబ్బు లింగం, కొడుకు కృష్ణమూర్తి, అల్లుడు పిండి ఎల్లాలు, యాదవ్వ మనుమడు సాయిరాజులతో కలిసి ఎర్టీగా కారులో తీసుకోని వెళ్ళి మృతుడు రోజు ప్రయాణించే దారిలో, సేలంపు శివారులో దర్గా వెళ్ళే రోడ్డు ప్రక్కన బండిపై నుండి పడినట్లుగా చిత్రీకరించారు.
ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ..
ఈ కేసులో సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ దర్యాప్తు ప్రారంభించి ఫిబ్రవరి 9 న మర్పడగ, రాంపల్లి మీదుగా నిందితులు వస్తున్నారని సమాచారంతో వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన పై నిందితులను పట్టుకోని విచారించగా హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారు.
నిందితుల వద్ద నుండి (04) సెల్ ఫోన్లను, ఎర్టీగా కారును, (02) మోటార్ సైకిళ్లను మరియు హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా పని చేసిన సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఈ కేసులో అబ్బు లింగం, యాదవ్వ, అబ్బు కృష్ణమూర్తి, పిండి ఎల్లం, పిండి కవితలను అరెస్ట్ చేశారు.