Siricilla Sarees: సిరిసిల్ల నేతన్నకు చేయుత... 4.24 కోట్ల మీటర్ల ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్స్
Siricilla Sarees: వస్త్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సిరిసిల్ల నేతన్నకు రాష్ట్ర ప్రభుత్వం చేయుతనిచ్చింది. త్వరలో మహిళా గ్రూపులకు అందజేసే చీరల ఆర్డర్స్ సిరిసిల్ల నేతన్నకు సర్కార్ ఇచ్చింది. సాంచల చప్పుడుతో నేతన్నలు బిజీగా మారుతున్నారు.
Siricilla Sarees: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి నేతన్న బతుకు పై భరోసా కల్పించే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అందించే యూనిఫామ్ చీరల ఆర్డర్స్ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అందజేశారు.
ఇందిరా క్రాంతి మహిళా శక్తి చీరల పథకంలో భాగంగా ఒకే రంగు చీరల ఆర్డర్స్ 4.24 కోట్ల మీటర్లు అందజేసింది. ఈ చీరలను ఈ ఏప్రిల్ 30 వ తేదీలోగా సిద్ధం చేయాలని సూచించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 కోట్లతో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేసిందని టెస్కో జీఎం అశోక్ రావు తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్ తో పోటీపడి స్వయం సమృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆర్డర్స్ తయారు చేసేలా యంత్రాలు ఆధునీకరించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన రూ. 500 కోట్ల బకాయిలు విడుదల చేసిందని తెలిపారు. ఆధునిక, నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసేలా సిద్ధం కావాలని పేర్కొన్నారు. ఇప్పటికే స్కూల్ యూనిఫాం మరమగ్గాల సంఘాలకు 65.67 లక్షల మీటర్లు ఆర్డర్స్ ఇచ్చామని వెల్లడించారు.
కృతజ్ఞతలు...
ఆర్డర్స్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత జౌళి శాఖ సెక్రటరీకి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ బాధ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డర్స్ కాఫీ అందుకునే కార్యక్రమంలో హ్యాండ్ లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఏడీ సాగర్, టెస్కో ఏడీ సందీప్ జోషి తదితరులు పాల్గొన్నారు.
ఏడాదిలో 30 మంది ఆత్మహత్య...
బతుకమ్మ చీరలు రద్దుతో నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందుల పాలయ్యారు. నేసిన గుడ్డకు గిరాకీ లేక, చేతినిండా పని దొరక్క నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏడాది కాలంలో 30 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. సంక్రాంతి కి రెండు నెలల ముందు తమిళనాడు ప్రభుత్వం పొంగల్ చీరల ఆర్డర్ తో నేత కార్మికులకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం మహిళా గ్రూపులకు పంపిణీ చేసే చీరల ఆర్డర్ రావడంతో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్లు అన్ని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)