TG Constables Protest : ఆగని తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన, 39 మందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్-sircilla tssp constable protest on one police system demand lift suspension on 39 police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Constables Protest : ఆగని తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన, 39 మందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్

TG Constables Protest : ఆగని తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన, 39 మందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్

HT Telugu Desk HT Telugu
Oct 27, 2024 09:40 PM IST

TG Constables Protest : తెలంగాణలో బెటాలియన్ కానిస్టేబుళ్ల నిరసన కొనసాగుతోంది. 39 మంది కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్ లో 17వ బెటాలియన్ కమాండెంట్ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేశారు.

ఆగని తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన, 39 మందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్
ఆగని తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన, 39 మందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్

తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన ఉద్ధృతమయింది. పోలీసుల ఆందోళనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 39 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ లను ఎత్తివేయాలని లేకుంటే తెలంగాణ స్పెషల్ పోలీసులందరినీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సర్దాపూర్ లోగల 17వ బెటాలియన్ కమాండెంట్ కార్యాలయం ముందు స్పెషల్ పోలీసులు బైఠాయించి ధర్నా చేశారు. బెటాలియన్ వద్దు.. ఏక్ పోలీస్ విధానం ముద్దు అంటు నినాదాలు చేశారు. వద్దురా నాయనా... కాంగ్రెస్ పాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ కమాండెంట్ పాలన వద్దంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళన కలకలం సృష్టిస్తుంది. పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని మొన్న కానిస్టేబుళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు రోడ్డెక్కి ఆందోళనకు దిగితే నిన్న కానిస్టేబుళ్ల బెటాలియన్ కమాండెంట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. సిరిసిల్లలో ఎస్పీ కాళ్ళు మొక్కి తమ గోడును విన్నవించారు. వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి, ఒకే పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్పెషల్ పోలీసుల ఆందోళనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 39 మంది పోలీసులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సిరిసిల్ల సమీపంలోని 17వ బెటాలియన్ కు చెందిన ఏడుగురు స్పెషల్ పోలీసులు ఉన్నారు.

సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ డ్యూటీలో ఉన్న పోలీసులు ఆందోళనకు దిగారు. కమాండెంట్ కార్యాలయం ముందు బైఠాయించి కమాండెంట్ రావాలని డిమాండ్ చేశారు. పోలీస్ డ్యూటీ పేరుతో వెట్టి చాకిరి చేయిస్తూ కుటుంబాలకు దూరం చేస్తున్నారని ఆందోళనకు దిగితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. బెటాలియన్ ను తొలగించి తమిళనాడు కర్ణాటక మాదిరిగా ఒకే పోలీస్ విధానం తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తి వేసి న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరారు. లేకుంటే 39 మందిని కాదు బెటాలియన్ లలో పని చేసే పోలీసులందరిని సస్పెండ్ చేయాలని వినతి పత్రం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీస్ అధికారుల తీరు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆందోళన వ్యక్తం చేశారు.

పోలీస్ డ్యూటీకి సంబంధం లేని పనులు

పోలీస్ డ్యూటీకి సంబంధం లేని పనులు కానిస్టేబుళ్లతో చేయిస్తూ మానసికంగా హింసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు స్పెషల్ పోలీసులు. బెటాలియన్ లో కూలీ పనులు, చెత్త ఏరే పనులు, మట్టి పనులతో పాటు వాగులో ఇసుక, పంటపొలాల్లో వరిగడ్డి కట్టలు తెచ్చే పనులు చేయించారని ఆరోపించారు. చివరకు మిషన్ భగీరథ పైపులు దొంగతనంగా తేవాలని కమాండెంట్ హుకుం జారీ చేయడంతో పైపులు సైతం తెచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర అధికారుల పెత్తనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారుల ఇళ్లలో పాచి పనులు, బొల్లు తోమడం, ఇళ్లు ఊడవడం, పిల్లలను స్కూల్ కి పంపడం, మందు తాగి పబ్బులో పడిపోతే తీసుకురావడం లాంటి వెట్టి చాకిరీ పనులు చెయిస్తున్నారని కానిస్టేబుల్ అవేదనతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులు భార్యలు ఆందోళన దిగితే వారిని అదుపులోకి తీసుకొని బెటాలియన్ కు తీసుకువచ్చి డ్యూటీ పేరుతో తమ భర్తలు ఇంటికి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తే స్పెషల్ పోలీసులను ఎందుకు పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించడం ఎంతవరకు సమంజసమని అధికారులను నిలదీశారు.

బెటాలియన్ వద్దు.. ఏక్ పోలీస్ కావాలి

పోలీస్ డ్యూటీ చేయడానికి తాము సిద్దంగా ఉన్నాం, కానీ వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాలని స్పెషల్ పోలీసులు కోరారు. బెటాలియన్ వద్దు ఏక్ పోలీస్ విధానం కావాలని డిమాండ్ చేశారు. డ్యూటీ పేరుతో కుటుంబాలకు దూరం చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. ఆంద్ర పోలీస్ అధికారుల పెత్తనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కమాండెంట్ రావాలని, తమ న్యాయమైన డిమాండ్లు అంగీకరించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ ఎత్తివేసి ఒకే పోలీస్ విధానం అమలయ్యే వరకు, వెట్టి చాకిరి నుంచి విముక్తి లభించే వరకు తమ పోరాటం ఆగదని స్పెషల్ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ఆందోళన, డిజిపి చర్యలు ఎటువైపు దారి తీస్తుందోనని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం