Oil Palm Farmers : సిరులు కురిపిస్తున్న ఆయిల్ పామ్ తోటలు, రూ.20413 చేరిన టన్ను గెలల ధర
Oil Palm Farmers : తెలంగాణ రైతాంగానికి ఆయిల్ పామ్ సిరులు కురిపిస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీతో పాటు ఏడాదిలోని రూ.7 వేలకు పైగా ధర పెరిగింది. ఒక్క సిరిసిల్ల జిల్లాలో 2100 ఎకరాలలో 700 మంది రైతులు ఈ పంటని సాగు చేస్తున్నారు.
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు రైతులకు బంగారు పంటగా మారింది. ధర పెరగడంతో పాటు ప్రభుత్వం నుంచి రూ.50,000 వరకు సబ్సిడీ అందుతుండడంతో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి దిగుబడి ప్రారంభం అయితే క్రమం తప్పకుండా ఆదాయం వస్తుండడం, కూలీల కొరత, కోతుల సమస్య లేకపోవడంతో క్రమంగా ఆయిల్ పామ్ సాగు పెరుగుతుంది.
వంటలో ఉపయోగించే నూనెలో దాదాపు 65-70 శాతం పామ్ ఆయిల్ ఉంటుంది. ఇంతగా డిమాండ్ ఉన్నప్పటికి మన దేశంలో పామ్ ఆయిల్ సాగు బాగా తక్కువ ఉండడం, మలేషియా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలో అత్యధిక దిగుబడిని ఇచ్చే నూనె గింజల పంటలో ఆయిల్ పామ్ పంట ఒకటి. భారతదేశం ముడి చమరు ( పెట్రోల్, డీజిల్ ) తర్వాత ఎక్కువగా పామ్ ఆయిల్ (ఆయిల్ పామ్ చెట్ల నుంచి వచ్చిన గెలలతో తీసిన ఆయిల్) ని దిగుమతి చేసుకుంటుంది. వంట నూనెలో దీని వాటా 65-70 శాతం వరకు ఉంటుంది. గత 100 సంవత్సరాలు నుంచి భారత దేశం వంట నూనె డిమాండ్ లో 80% వరకు దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఇంత డిమాండ్ ఉన్న పంట కాబట్టే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట మీద ఎక్కువగా శ్రద్ధ చూపించి రైతులకి తోడ్పాటుగా మొక్కలు, డ్రిప్ మీద సబ్సిడీ ఇస్తున్నాయి. దీనికి తోడుగా రైతులకి ఎరువులు అంతర పంటలకు పెట్టుబడి సాయం కింద ఒక ఎకరానికి రూ.4200 మొదటి 4 సవంత్సరాలు ఇస్తుంది.
ఏడాదిలోనే రూ.7000 పెరిగిన ధర
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో విదేశాల నుంచి దిగుమతి అయ్యే పామ్ ఆయిల్ మీద 20 శాతం సుంకం విధిస్తూ కేంద్రం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఆయిల్ పామ్ ధర నిర్ణయంలో తీసుకునే ఆయిల్ ఎక్ష్ ట్రాక్షన్ రేట్ (ఓఈఆర్) ను 2024-25 సంవత్సరానికి 19.42 శాతంగా ప్రభుత్వం నిర్ణయించింది. (గత సంవంత్సరంలో 2023-24 ఓఈఆర్ 19.32 కాగా) దీని వలన కూడా రైతులకి ఆయిల్ పామ్ గెలలు సుమారుగా రూ. 160-180 వరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో గడిచిన ఆరు నెలలోనే రూ. 7000 వరకు రేటు పెరిగి టన్ను ధర రూ.20413 రైతులకు గిట్టుబాటు అవుతుంది.
సిరిసిల్ల జిల్లాలో 2100 ఎకరాల్లో సాగు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ పామ్ తోటలు 2022-23 నుంచి ప్రారంభం అయ్యాయి. ఇప్పటి వరకు 2100 ఎకరాలలో 700 మంది రైతులు ఈ పంటని సాగు చేస్తున్నారు. వచ్చే సంవంత్సరం 2025-26 ఆగష్టు నుంచి మొదటి కోత ప్రారంభం అవుతుంది. కోసిన పంటని దగ్గరలో ఉన్న కొనుగోలు కేంద్రాల ద్వారా మార్కెటింగ్ జరుగుతుంది. ప్రతి నెల ధర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఎకరానికి ఏటా లక్ష గ్యారంటీ ఆదాయం
ఆయిల్ పామ్ సాగు చేస్తే ఏటా ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం గ్యారంటీగా వస్తుందంటున్నారు అధికారులు. పంట సాగు మొదలు పెట్టిన 4వ సంవత్సరం నుంచి దిగుబడి వస్తుందని, 4 నుంచి 6వ సంవత్సరం వరకు 5 నుంచి 7 టన్నులు దిగుబడి వస్తుంది. 7వ సంవత్సరం నుంచి 10 నుంచి 15 టన్నులు దిగుబడి వస్తుంది. ప్రీ యునిక్ కంపెనీ వారు పంట గెలలు కొనుగోలు చేస్తారు. పంట కొనుగోలు చేసిన వారం రోజులలో రైతు బ్యాంకు ఖాతాకు డబ్బు జమ అవుతోంది. కచ్చితమైన మార్కెటింగ్ ఉన్న పంట, దళారులు ఉండరు. రైతులు ఆయిల్ పామ్ పంట సాగుపై దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ది చెందాలని సిరిసిల్ల డివిజన్ ఉద్యాన అధికారి వి. గోవర్ధన్, వేములవాడ డివిజన్ అధికారి సి.హెచ్. లోకేష్ కోరారు. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన అధికారిని వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా ఆయిల్ పామ్ కంపెనీ సిబ్బందిని సంప్రదించాలని కోరుతున్నారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం