Sircilla Crime : సిరిసిల్ల జిల్లాలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు, గంజాయి చాక్లెట్లు సీజ్-sircilla crime news police arrest 6 members ganja gang seizes ganja chocolates ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sircilla Crime : సిరిసిల్ల జిల్లాలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు, గంజాయి చాక్లెట్లు సీజ్

Sircilla Crime : సిరిసిల్ల జిల్లాలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు, గంజాయి చాక్లెట్లు సీజ్

HT Telugu Desk HT Telugu
Jun 28, 2024 10:40 PM IST

Sircilla Crime : నర్సింగ్ కోర్సు చేస్తు్న్న విద్యార్థులు మరికొందరితో కలిసి ముఠాగా ఏర్పడి గంజాయి చాకెట్లు విక్రయిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా పోలీసులు గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు చేశారు.

సిరిసిల్ల జిల్లాలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు, గంజాయి చాక్లెట్లు సీజ్
సిరిసిల్ల జిల్లాలో గంజాయి గ్యాంగ్ గుట్టురట్టు, గంజాయి చాక్లెట్లు సీజ్

Sircilla Crime : గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. ఈ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ వారి నుంచి 4 కిలోల 700 గ్రాముల గంజాయి, 30 గ్రాముల గంజాయి చాక్లెట్స్ , 4 సెల్ ఫోన్ లు, 2 బైక్ లు, 2 బ్యాగ్ లు స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో సిరిసిల్లలో పట్టుబడ్డ వారిని చూపించి వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల అంబేడ్కర్ నగర్ కు చెందిన పేరుక వెంకటేష్, పెద్దపల్లి జిల్లా పెద్దబొంకూర్ కు చెందిన కలవేన ప్రవీణ్ కుమార్, మంచిర్యాల జిల్లా మదురానగర్ కు చెందిన నార్ల అక్షయ్, హైదరాబాద్ రాంనగర్ చెందిన అలెగ్జెండర్ జోసెఫ్, పెద్దపల్లి అమర్ నగర్ కు చెందిన బండి సాయిచరణ్, కరీంనగర్ లోని మంకమ్మతోట చెందిన మీస సాయి రామ్... ఈ ఆరుగురు ముఠాగా ఏర్పడి గంజాయి సేవించడంతోపాటు సప్లై చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. సిరిసిల్లలో అమ్మడానికి ప్రవీణ్, సాయిచరణ్, సాయిరామ్ లు బైక్ పై కొత్తచెరువు వద్ద గల స్మశానవాటిక వద్దకు వచ్చి సాయి చరణ్ తనకు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేయగా వెంకటేష్, అక్షయ్, జోసెఫ్ లు అక్కడికి చేరుకున్నారు. గంజాయి, గంజాయితో తయారు చేసిన చాక్లెట్ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకునే క్రమంలో సాయిచరణ్ , సాయిరామ్ డబ్బులతోపాటు కొంత గంజాయితో పారిపోయారని ఎస్పీ చెప్పారు. ప్రవీణ్, వెంకటేష్, అక్షయ్, జోసెఫ్ లను అరెస్టు చేశామన్నారు.

నర్సింగ్ కోర్సు విద్యార్థులు

కలవేన ప్రవీణ్ చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో నర్సింగ్ కోర్సు చేస్తూ బొమ్మకల్ లో సాయిచరణ్, సాయిబబ్బిలతో కలిసి అద్దె రూమ్ లో ఉంటున్నాడు.‌ సాయిచరణ్, ప్రవీణ్ గంజాయిని అక్షయ్ కి తెలిసిన వ్యక్తి వద్ద భద్రాచలంలో కొనుక్కొని వచ్చి అట్టి గంజాయిని రూమ్ లో పెట్టుకొని ముగ్గురు కలిసి వేములవాడ, సిరిసిల్లలో ఫోన్స్ ద్వారా ఇతరులకు తెలుపుతూ వారికి అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. గత 4 రోజుల క్రితం ప్రవీణ్, సాయిచరణ్ లు కలసి తెలిసిన వ్యక్తి వద్ద గంజాయి, గంజాయితో తయారు చేసిన చాక్లెట్ ను కొనుగోలు చేసి అప్పటి నుంచి గంజాయి తాగుతూ, మిగిలిన గంజాయిని, గంజాయితో తయారు చేసిన చాక్లెట్ ను తీసుకొని సిరిసిల్లలో విక్రయించేందుకు యత్నించగా పట్టుకున్నామని ఎస్పీ ప్రకటించారు. పట్టుబడ్డ నలుగురిని రిమాండ్ కు తరలించి, పరారీలో ఉన్న ఇద్దరి కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

గంజాయి సేవించిన , విక్రయించిన కఠిన చర్యలు తప్పవు - ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి సేవించిన , విక్రయించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయితో తయారు చేసిన పదార్థాల గురించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ రఘుపతి, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీకాంత్ ను ఎస్పీ అభినందించారు.

రిపోర్టింగ్: కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందూస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం