KTR : కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం-సాగునీరు విడుదలకు 48 గంటల డెడ్ లైన్ : కేటీఆర్-sircilla brs ktr demands water released from mid manair crops dried water scarcity ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr : కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం-సాగునీరు విడుదలకు 48 గంటల డెడ్ లైన్ : కేటీఆర్

KTR : కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం-సాగునీరు విడుదలకు 48 గంటల డెడ్ లైన్ : కేటీఆర్

HT Telugu Desk HT Telugu

KTR : సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, 48 గంటల్లో మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేయకపోతే మంత్రి ఛాంబర్ లో ధర్నా చేస్తానని మాజీ మంత్రి కేటీఆర్ అల్టిమేటం జారీ చేశారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవుని కేటీఆర్ ఆరోపించారు.

కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం-సాగునీరు విడుదలకు 48 గంటల డెడ్ లైన్ : కేటీఆర్

KTR : సాగునీరు అందక ఎండుతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే సాగునీటి విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. 48 గంటల్లో మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేయకుంటే మంత్రి ఛాంబర్ లో బైఠాయించి ధర్నా చేస్తానని రైతులతో కలిసి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట, దేవునిగుట్ట తండాలో ఎండిపోయిన పంట పొలాలను కేటీఆర్ పరిశీలించారు. సాగునీరు అందక నెర్రలు బారిన వరి పంట పొలాన్ని పరిశీలించి రైతుల ఆవేదన ఆక్రందనను ప్రత్యక్షంగా చూశారు. సాగునీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని కేటీఆర్ ను రైతన్నలు వేడుకున్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువని కేటిఆర్ ఆరోపించారు.

కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరమని విమర్శించారు. మేడిగడ్డలో జరిగిన కుట్రపూరిత ప్రమాదాన్ని సాకుగా చూపించి కేసీఆర్‌పై ఉన్న కోపం, ద్వేషంతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండిపోయేలా రేవంత్ సర్కార్ చేస్తోందని ఆరోపించారు. సిరిసిల్ల, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో సాగునీరు లేక వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి, ఈఎన్సీతో మాట్లాడిన కేటీఆర్

ఎండిపోయిన పంటలను స్వయంగా పరిశీలించిన కేటీఆర్ వెంటనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ అనిల్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. ఎండుతున్న పంటలు కాపాడేందుకు మిడ్ మానేర్ నుంచి ఒక టీఎంసీ నీటిని మల్కపేట రిజర్వాయర్ కు అక్కడ నుంచి సింగసముద్రంకు తరలించి రైతుల పంటలను కాపాడాలని కోరారు. ప్రస్తుతం మిడ్ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, 1 టీఎంసీ నీటిని మల్కపేట రిజర్వాయర్‌కు విడుదల చేస్తే ఈ ప్రాంతంలోని రైతులు వ్యవసాయం చేయడానికి సరిపోతుందన్నారు.

తాగునీటికి 3 టీఎంసీలు చాలని, ఇంకా 13 టీఎంసీలు మిగులుతాయని తాగునీటికి ఇబ్బంది ఉండదని కేటీఆర్ స్పష్టం చేశారు. అందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు.‌ 48 గంటల్లో నీళ్లు విడుదల చేయకపోతే మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తానని కేటీఆర్ హెచ్చరించారు. రైతులతో కలిసి ఆందోళన ఉదృతం చేస్తామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

మేడిగడ్డపై కుట్ర

కెసిఆర్ పై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు కేటీఆర్. కేసీఆర్ పై అనవసరమైన ద్వేషంతో మేడిగడ్డపై కుట్ర పన్నారని ఆరోపించారు. మేడిగడ్డలో చిన్న పర్రెను పెద్ద ప్రమాదంగా ప్రచారం చేస్తూ అక్కడి నుంచి నీళ్లు తీసుకోకుండా చేశారని విమర్శించారు. 15 నెలలుగా కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టు పాడైపోయిందని పిచ్చి ప్రచారం చేస్తూ రైతులు వేసిన పంటలు ఎండిపోయేలా చేశారని ఆరోపించారు. కేసీఆర్‌పై కోపం ఉంటే రాజకీయంగా తలపడాలి కానీ రైతులను గోస పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్ 450 మంది రైతులను పొట్టన పెట్టుకుందన్నారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్‌లో ఒక్క మాటను కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రైతు బంధు లేదు, రైతు భరోసా రుణమాఫీ కాలేదు, బోనస్ ఇవ్వలేదని ఈ ప్రభుత్వానికి కరెంటు ఇచ్చే తెలివి కూడా లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీళ్లు పాతాళంలోకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాల్లో కలిసిపోయాయని విమర్శించారు. రైతులు ధైర్యంతో ఉండండి, నీళ్ళు వచ్చేదాకా పోరాడుతామని అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు.

బాదితులకు భరోసా ఇచ్చిన కేటీఆర్

సిరిసిల్ల లో ఇటీవల ట్రేడ్ లైసెన్స్ లేదని మున్సిపల్ అధికారులు టీ స్టాల్ తొలగింపుతో ఉపాధి కోల్పోయిన శ్రీనివాస్ ను, అసైన్డ్ భూమితో జైల్ పాలై బెయిల్ పై విడుదలైన జిల్లెల్లకు చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని కేటీఆర్ పరామర్శించారు. పోతుగల్ లో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు జెల్ల దేవయ్య కుటుంబాన్ని పరామర్శించారు. పలు వివాహాలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. భాదితులను పరామర్శించిన కేటీఆర్, చిల్లర ప్రభుత్వం కొనసాగుతుందని విమర్శించారు.

గరీబోళ్ల పొట్ట కొట్టడం... అమాయకులను జైళ్ళ పెట్టడమేందని ప్రశ్నించారు. భయపడకండి... మళ్ళీ మంచి రోజులు వస్తాయని భాదితులకు భరోసా ఇచ్చారు. నా మీద కోపం మీ మీద తీర్చుకుంటున్నారని ఆరోపించారు. మీకు అండగా ఉంటా..కేసుకు భయపడాల్సిన అవసరం లేదు...బోగస్ కేసు నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. మీకు ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్ కాల్ చేయండి, నేను చూసుకుంటానని భాదితులకు కేటీఆర్ దైర్యం చెప్పారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం