నైనీ బొగ్గు గనిలో తవ్వకాలు - 13 దశాబ్దాల 'సింగరేణి' చరిత్రలో ఇదే మొదటిసారి...!
సింగరేణి సంస్థ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. బయటి రాష్ట్రంలోని గనిలో తొలిసారిగా తవ్వకాలను ప్రారంభించింది. 13 దశాబ్ధాల సింగరేణి సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించటంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఒడిశాలో సింగరేణి నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభమైంది. 13 దశాబ్దాల చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలోకి సింగరేణి సంస్థ అడుగుపెట్టింది. అంగూల్ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ ను ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వర్చువల్ గా ప్రారంభించారు.
ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై బొగ్గు గనులు నిర్వహిస్తున్న సింగరేణి ఇప్పుడు నైనీ బొగ్గు బ్లాక్ ద్వారా ఇతర రాష్ట్రాల్లోకి అడుగుపెట్టినట్లు అయింది. ఇదోక ఒక చరిత్రాత్మక ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు.
2016 మే నెలలో ఈ గనిని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణికి కేటాయించింది. అన్ని రకాల అనుమతులు సాధించినప్పటికీ… తవ్వకం ప్రారంభించడానికి తొమ్మిదేళ్ళ సుదీర్ఘ కాలం నిరీక్షించాల్సి వచ్చింది. ఇటీవలే కాలంలో ప్రభుత్వం ఈ తవ్వకాల విషయంలో మరింత దృష్టి పెట్టడంతో లైన్ క్లియర్ అయిపోయింది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అధికారులు ఒడిశా రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోనూ, సంబంధిత అధికారులతోనూ సంప్రదింపులు జరిపారు. గని ప్రారంభానికి మార్గం సుగమం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ వల్ల సింగరేణికి అతిపెద్ద బొగ్గు బ్లాక్ లభించింది. తద్వారా వార్షిక అధికోత్పత్తి సాధనకు మార్గం సుగమమై సంస్థ ఆర్థిక పటిష్టతకు దోహదపడనుంది.
సీఎం రేవంత్ హర్షం…
సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించడం అభినందనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దాదాపు 136 ఏళ్లుగా తవ్వకాలు సాగిస్తూ రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ సింగరేణి… రాష్ట్రం బయట ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాకులో తవ్వకాలు ప్రారంభించి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేసిందని పేర్కొన్నారు.
సింగరేణి కోసం ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవ వల్లే తొలిసారి దేశంలోని ఇతర రాష్ట్రంలోనూ బొగ్గు గనిని ప్రారంభించడం సాధ్యమైందని వ్యాఖ్యానించారు. ఇది మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఒడిశాలోని అంగుల్ జిల్లాలోని నైనీ గని ప్రారంభించడం ద్వారా సింగరేణి కొత్త శకానికి నాంది పలికిందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.
నైనీ బొగ్గు గనులకు అన్ని అనుమతులు సాధించి అందులో తవ్వకాలు ప్రారంభించిన చారిత్రక ఘట్టం సాకారం కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మణిమకుటంగా, వేలాది కార్మిక కుటుంబాలకు జీవనాధానంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ అభివృద్ధికి… విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి… సింగరేణి సంస్థకు అభినందనలు తెలియజేశారు.
సంబంధిత కథనం