Siddipet Road Accident : లిఫ్ట్ అడిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
Siddipet Road Accident : సిద్దిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పుస్తకాలు కొనుక్కునేందుకు బైక్ లిఫ్ట్ అడిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
Siddipet Road Accident : సిద్ధిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న ఇద్దరు స్నేహితులు బుధవారం పుస్తకాలు కొనుక్కోవాలని రోడ్డు పైకి వచ్చి స్కూటీపై వస్తున్న ఒకరిని లిఫ్ట్ అడిగి గజ్వేల్ కి బయల్దేరారు. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న యువకుడితో పాటు ఒక విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద సంఘటన సిద్ధిపేట జిల్లా(Siddipet) గజ్వేల్ లోని బాలికల ఎడ్యుకేషన్ హబ్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్ మండలం శేరిపల్లి బందారం గ్రామానికి చెందిన గడ్డమీది అరుణ్, అతడి స్నేహితుడు రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన నక్కాని దిలీప్ గజ్వేల్ లోని బాలుర డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుకుంటూ, బాలుర వసతి గృహంలో ఉంటున్నారు.
పుస్తకాలు కొనుక్కోవడానికి వెళ్తూ
బుధవారం పుస్తకాలు కావాలని ఇద్దరు స్నేహితులు గజ్వేల్ కి వెళ్లడానికి రోడ్డు పైకి వచ్చారు. ఈ క్రమంలోని గజ్వేల్ వైపు వెళ్తున్న అయన్స్ అనే యువకుడిని లిఫ్ట్ అడిగారు. వీరు ప్రయాణిస్తున్న యాక్టీవా వాహనం మార్గమధ్యలో గజ్వేల్ బాలికలఎడ్యుకేషన్ హబ్ సమీపంలోకి అదుపుతప్పి డివైడర్ ను(Siddipet Road Accident ) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయాలపాలవడంతో వెంటనే వారిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్(Hyderabad) కు తరలించాలని సూచించారు. మార్గమధ్యలో అయన్స్ మృతి చెందారు. అయన్స్ మదర్సాలో చదువుకొని కొంతకాలంగా గజ్వేల్ పట్టణంలోని వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. కాగా మరో విద్యార్థి దిలీప్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. చేతికి అంది వచ్చిన కొడుకుల మరణవార్త విని వారి తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని బాలుడు మృతి
రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లిలో చోటుచేసుకుంది. సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన తలపాక కిషన్, లావణ్య దంపతులకు రిత్విక్ (6), దాసు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లావణ్య పిల్లలను తీసుకొని తన పుట్టిల్లు అయినా కుకునూరుపల్లి మండలం మత్ పల్లికి వెళ్తుంది. ఈ క్రమంలో అంకిరెడ్డిపల్లి నుంచి పిల్లలతో బస్సులో వెళ్లి కుకునూర్ పల్లిలో బస్సు దిగి, రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి సిద్ధిపేట వైపు అతివేగంగా వెళ్తున్న లారీ రుత్విక్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి కళ్లెదుటే కొడుకు మృతిచెందడంతో ఆమె తీవ్ర శోకంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హెచ్.టి.తెలుగు రిపోర్టర్, సిద్దిపేట
సంబంధిత కథనం