Siddipet News : 10వ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు పెట్టండి- అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
Siddipet News : సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ కోరారు. ప్రతి పాఠశాలలో 5+1(5 రోజుల బోధన, 1 రోజు అసెస్మెంట్) విధానంలో బోధన చేయాలని సూచించారు.
Siddipet News : బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సమయంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వార్షిక పరీక్షలు ముగిసే వరకు ఏ ఒక్క ఉపాధ్యాయుడు సెలవు తీసుకోకుండా పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ కోరారు. ప్రతి జిల్లా విద్యాధికారి మొదలు మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే కిందిస్థాయి సిబ్బంది ఉపాధ్యాయులు సైతం వార్షిక పరీక్షలు ముగిసే వరకు ప్రతినెల వారీగా టూర్ డైరీని తయారు చేసుకుని తమ సంతకంతో తనకు నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పాఠశాలలో 5+1 అనే సూత్ర ప్రాయంగా ఉపాధ్యాయుడు బోధన చేయాలన్నారు. 5 రోజులు కోచింగ్ 1 రోజు అసెస్మెంట్ చెయ్యాలని అదనపు కలెక్టర్ సూచించారు.
హాజరు ఉన్నతి పోర్టల్ లో అప్లోడ్ చేయాలి
తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధిత పోర్టల్ లో ప్రతిరోజు ఎఫ్ఎల్ఎన్, ఉన్నతిలలో విద్యార్థుల హాజరు శాతం ఇతరత్రా వివరాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని, రోజు వారిగా అటెండెన్స్ వివరాలను యాప్ లో అప్లోడ్ శాతం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఎంఈఓలకు గరిమ అగర్వాల్ తెలిపారు. యాప్ సాంకేతిక సమస్యలు, ఇతరత్రా కారణాలు చెప్పి అప్లోడ్ చేయకపోతే కఠిన చర్యలు తప్పవని అగర్వాల్ హెచ్చరించారు.
100 శాతం ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి
గత విద్యా సంవత్సరం మాదిరిగానే ఈ విద్యా సంవత్సరంలో కూడా సిద్ధిపేట జిల్లాను రాష్ట్రంలోనే పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నించాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. జిల్లాలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 100 శాతం హాజరయ్యేలా, ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణత అయ్యే విధంగా ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలాల్లో ఎంఈఓలు, హెచ్ఎం లతో సమావేశం నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. 10వ తరగతి విద్యార్థులకు ఇప్పటి నుండి ఉదయం 8:30-9:30 సాయంత్రం 4:45-5:45 రెండు తరగతులు అదనంగా తీసుకుని స్టడీ హవర్స్, డౌట్స్ లాంటివి ఎలాంటివి లేకుండా రోజు ఒక పరీక్ష నిర్వహించాలని తెలిపారు. రోజు వారీగా సబ్జెక్ట్ వారీగా షెడ్యూల్ చేసీ డీఈఓ ఆఫీస్ నుంచి అందరికీ అందజెయ్యాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు రైటింగ్ ప్రాక్టీస్ తప్పనిసరి అన్నారు. ఎచ్ఎంలు పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు స్కూల్ కి సరిగా రాని వారిని గుర్తించి వారి తల్లిదండ్రులను మాట్లాడి కారణాలను తెలుసుకుని పాఠశాలకు వచ్చేలా చెయ్యాలన్నారు. ప్రతి 15రోజులకొకసారి పేరెంట్స్ మీటింగ్ పెట్టాలన్నారు.
ప్రతి ఎంఈఓకు కేటాయించిన పాఠశాలలను తప్పనిసరిగా విజిట్ చేసి పాఠ్యాంశ బోధన, మధ్యాహ్న భోజన పథకం ఇతరత్రా అంశాల్ని ప్రతి ఒక్కటి పర్యవేక్షణ చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీ పీరియడ్ తప్పనిసరిగా కేటాయించాలని, పిల్లలకు రైటింగ్ ప్రాక్టీస్ తప్పనిసరి చేయాలన్నారు .ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.