Siddipet Crime : అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త- సిద్దిపేట కోర్టు సంచలన తీర్పు
Siddipet Crime : భార్యపై అనుమానంతో కిరోసిన్ పోసి హత్య చేశాడో దుర్మార్గుడు. 2017లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి విచారణ పూర్తికాగ సిద్దిపేట కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది.
Siddipet Crime : ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై అనుమానంతో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చిన(Husband Kills Wife) భర్తకు సిద్దిపేట జిల్లా(Siddipet Court) ప్రధాన న్యాయమూర్తి రఘురాం యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించారని సిద్దిపేట పోలీస్ కమిషనర్ బి.అనురాధ తెలిపారు. సిద్దిపేట(Siddipet Crime) జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండ్లపల్లి గ్రామానికి చెందిన గంట రవి, సిద్దిపేట మండలం రావుల గ్రామానికి చెందిన యాదవ్వ 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొద్దిరోజులుగా రవి భార్యపై అనుమానంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లనీయకుండా చిత్రహింసలు పెట్టేవాడు.
కిరోసిన్ పోసి నిప్పుపెట్టడంతో
ఈ క్రమంలో 2017 జూన్ 27న ఉదయం 11 గంటలకు భార్య యాదవ్వను కొట్టి కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు రవి. చుట్టుపక్కల వారు చూసి యాదవ్వను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి తదుపరి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి తల్లి పోచవ్వ ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ సుభాష్ గౌడ్ కేసు నమోదు చేశాడు. సీఐ నిరంజన్ కేసు విచారణ ప్రారంభించి నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ డిమాండ్ కు పంపించారు. అప్పటి సీఐ పరశురాం గౌడ్ కేసు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
ఆరోజు నుంచి నేటి వరకు సిద్దిపేట జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. కాగా సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ టి. రఘురామ్, ఇరువురి వాదనలు విన్న తర్వాత రవిపై పై నేరం రుజువైనందున నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష (Life imprisonment) రూ.1,000 జరిమానా విధించారు. కేసు ఇన్వెస్టిగేషన్ లో కీలక పాత్ర వహించిన అధికారులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు కానిస్టేబుల్ అంజిరెడ్డి, కోర్టు లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ రాజమల్లు, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజులను కమిషనర్ అనురాధ అభినందించి, త్వరలో రివార్డు అందజేస్తామని తెలిపారు.
కొడుకుపై తండ్రి కత్తితో దాడి
బెట్టింగ్, జల్సాలకు అలవాటుపడి మద్యానికి బానిసై కుటుంబాన్నిఅప్పులపాలు చేస్తున్న కొడుకుపై విసిగిపోయిన తండ్రి, వేరొకరితో కలిసి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లా(Medak Crime) తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన క్రిష్ణయ్య ,విజయ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కొడుకు వంశీ ప్రవేట్ జాబ్ వదిలేసి తాగుడుకు బానిసై, బెట్టింగ్ లకు అలవాటు పడి ఇరవై లక్షల వరకు అప్పు చేశాడు. కాగా వంశీకి సంవత్సరం క్రితం వివాహం కాగా కుటుంబ గొడవలతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి ఆరునెలల కిందట పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
దీంతో తండ్రి క్రిష్ణయ్య తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వంశీ తాగిన మైకంలో తండ్రితో గొడవకు దిగాడు. అదే సమయంలో తండ్రి క్రిష్ణయ్య , అతనివద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ తో కలిసి కత్తులతో వంశీపై దాడికి దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వంశీని హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. క్రిష్ణయ్య,లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సంబంధిత కథనం