Parenting Tips : వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి-ఆ బాధ్యత తల్లిదండ్రులదే!-siddipet cp anuradha says summer holiday parents careful about kids have a look on them ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Parenting Tips : వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి-ఆ బాధ్యత తల్లిదండ్రులదే!

Parenting Tips : వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి-ఆ బాధ్యత తల్లిదండ్రులదే!

HT Telugu Desk HT Telugu
Apr 30, 2024 05:34 PM IST

Parenting Tips : స్కూల్స్ కు వేసవి సెలవులు ప్రకటించారు. పిల్లలు ఇళ్ల వద్ద ఉంటారు. సెలవుల్లో పిల్లలు ఏం చేస్తున్నారు, వారి ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. ఈతకు వెళ్లడం, మొబైల్ ఫోన్లు అతిగా వాడకుండా, పిల్లల చర్యలపై దృష్టి పెట్టాలని సిద్దిపేట సీపీ అనురాధ తెలిపారు.

వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి-ఆ బాధ్యత తల్లిదండ్రులదే!
వేసవి సెలవులలో పిల్లలపై దృష్టి పెట్టండి-ఆ బాధ్యత తల్లిదండ్రులదే!

Parenting Tips : వేసవి సెలవుల(Summer Holidays)లో ఎంతో మంది అమాయక విద్యార్థులు ఆకారణంగా ప్రాణాలు పోగొట్టుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నారని సిద్ధిపేట(Siddipet) పోలీస్ కమిషనర్ అనురాధ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తు భారతావనికి వారె పునాదులని వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడే తల్లిదండ్రులు(Parents) సెలవు రోజుల్లో పిల్లల రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా వారిని కాపాడుకోవాలి.

yearly horoscope entry point

చెరువుల్లో, బావుల్లో, కుంటల్లో ఈతకు పంపించకూడదు

'తల్లిదండ్రులకు చెప్పకుండా పిల్లలు ఎక్కడికి వెల్లవద్దని, మిత్రులతో కలిసి ఆడుకుంటూ అటు నుంచి చెరువు వద్దకు, కుంటల వద్దకు పోయి ఈత రాకుండానే ఉత్సాహంతో వాటిలో దిగి ప్రమాదాల్లో పడకుండా చూసుకోవాలి. చెరువుల్లో, బావుల్లో, కుంటల్లో, మడుగులలో పిల్లలను ఈతకు ప్రోత్సహించవద్దు. స్విమ్మింగ్ పూల్ లకు పెద్దలు ఎవరైనా వెంట లేకుండా ఈతకు పంపరాదు. బైకులు, కార్ల తాళాలు వారికి కనపడే విధంగా పెట్టవద్దు. సరదాగా రైడ్ కు వెళ్లివారు ప్రమాదాలకు గురి కావడమే కాక ఇతరుల ప్రాణాలకు హానీ కలిగించకుండా చూడాలి. మొబైల్ ఫోన్లను వాడకుండా చూడాలి. ఒకవేళ మొబైల్ ఫోన్(Mobile Phone) ఇచ్చినా, వారు ఎవరితో ఛాటింగ్ చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఫేస్ బుక్(Face Book), వాట్సాప్(Whats App) లాంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విషయాలు, ఫొటోలు పోస్ట్ చేయవద్దని చెప్పాలి.'- సీపీ అనురాధ

మొబైల్ ఫోన్లో “పబ్జి” లాంటి ఆటలను ఆడకుండా చూడాలి

మొబైల్ ఫోన్లో(Mobile) ప్రమాదకర, హింస ప్రవృత్తిని ప్రేరేపించే “పబ్జి” (Pub-G)లాంటి ఆటలను ఆడకుండా చూడాలని సీపీ అనురాధ సూచించారు. మొబైల్ ఫోన్ లో పిల్లలను ఇష్టం వచ్చినట్లు గేమ్స్, యాప్స్ డౌన్లోడ్ చేయకుండా చూడాలన్నారు. కొన్ని మోసపూరిత యాప్ లను , గేమ్(Games) లను డౌన్లోడ్ చేసుకోవడానికి ముందు మీ ఖాతాలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని అడిగి మీకు తెలియకుండానే మీ బ్యాంకు ఖాతాలోని డబ్బును కాజేసే ప్రమాదముందన్నారు. అపార్ట్ మెంట్లలో ఉండేవారు పిల్లలు లిఫ్ట్ (Lift)కేబిన్ లోకి ఒంటరిగా పోయి, అందులోని బటన్ లు ఇష్టం వచ్చినట్లు నొక్కి అందులో ఇరుక్కొని ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు.

సెలవు దినాల్లో పిల్లలకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ

'పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులనే అనుకరిస్తారు. కనుక వారి ముందు ఎవరి గురించి చెడుగా మాట్లాడరాదు. చెడుగా ప్రవర్తించరాదు, కుటుంబ మనస్పర్థలు చర్చించరాదు. వారి భవిష్యత్తు ప్రవర్తనకు మీరే మార్గదర్శకులని మరువరాదు. పిల్లల భవిష్యత్తే మీ లక్ష్యంగా మీరు చేస్తున్న పనులను వారికీ అర్థం అయ్యే రీతిలో చెప్పాలి. తద్వారా మీకు వారి పట్ల ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని జాగ్రత్తగా ఉండే అవకాశం ఇవ్వాలి. వేసవి సెలవు దినాల్లో పిల్లలకు ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పిస్తూ, ఇంటిలో ఉన్నప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు నైతిక విలువల గురించి తెలియజేస్తుండాలి. గ్యాస్ సిలిండర్లు(Gas Cylinders), ఎలక్ట్రిక్ వైర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్రీజ్ ల పట్ల పిల్లలను అప్రమత్తంగా ఉంచాలి. “PREVENTION IS BETTER THAN CURE” అని గుర్తించి, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడేకంటే ముందే జాగ్రత్తపడి సంతోషంగా ఉండటం మంచిది' అని సీపీ అనురాధ అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం