KTR Case : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ.. కేటీఆర్ తరపు లాయర్ లాజిక్ ఇదే!
KTR Case : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. అటు ఏసీబీ, ఇటు కేటీఆర్ తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కేటీఆర్ తరఫున సిద్దార్థ్ దావే వాదనలు వినిపిస్తూ.. కీలక అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన సెక్షన్ అసలు కేటీఆర్‌కు వర్తించదని స్పష్టం చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్ తరఫున సిద్దార్థ్ దావే వాదనలు వినిపించారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరుపుతోంది. కేటీఆర్ వేసిన కాష్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్‌పై ఉన్న నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని ఏసీబీ ఉన్నత న్యాయస్థానాన్ని కోరింది. ఈ సందర్భంగా వాడీవేడి వాదనలు జరిగాయి.
డబ్బులు చేరిన సంస్థను నిందితుల జాబితాలో చేర్చలేదని కేటీఆర్ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. విదేశీ సంస్థ పేరు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ఎఫ్ఈవో వివరాలు కోర్టుకు కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. విచారణ కొనసాగే క్రమంలో నిందితుడిగా చేర్చవచ్చు కదా అని హైకోర్టు ప్రశ్నించింది.
5 ఆరోపణలు..
'13(1)(ఏ) సెక్షన్ అసలు వర్తించదు. ఈ డబ్బుల ద్వారా లబ్ధి పొందింది కేటీఆర్ కాదు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నప్పుడు పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదు. కానీ ఇక్కడ ముందుగానే ఉన్న అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేశారు. కేటీఆర్‌పై 5 ఆరోపణలు చేశారు. అనుమతి లేకుండా విదేశీ కరెన్సీనీ విదేశీ సంస్థకు పంపారు. అగ్రిమెంట్ లేకుండానే చెల్లింపులు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడే చెల్లింపులు చేశారు. ఎఫ్ఈవో నుండి డిసెంబర్ 20, 2023 రోజు మెయిల్ చేశారు. మిగతా నిధులు చెల్లిస్తే సీజన్ 10 నిర్వహిస్తామని చెప్పారు' అని కేటీఆర్ తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.
థర్డ్ పార్టీకి లబ్ధి..
'26, డిసెంబర్ 2023 నాడు ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఎఫ్ఈవోకు రెండు విడతల్లో చెల్లించిన ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయ్యాయని అంటున్నారు. కానీ నిధులు చేరిన ఎఫ్ఈవోను మాత్రం నిందితుల జాబితాలో చేర్చలేదు. ఇక్కడ దర్డ్ పార్టీ లబ్ధి పొందింది అని చెప్తున్నారు. కానీ థర్డ్ పార్టీ ఎవరో ఎఫ్ఐఆర్‌లో ఎక్కడ చెప్పలేదు. డిసెంబర్ 18 సాయంత్రం 5:30కి కంపిటేంట్ అథారిటీ నుండి ఏసీబీకి అనుమతి వచ్చింది. డిసెంబర్ 19న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది' అని కేటీఆర్ లాయర్ వివరించారు.
అలా నిబంధన ఉందా..
'ప్రభుత్వ నిధులు దుర్వినియోగం ఆయాయి ఆన్నది అవాస్తవం. అప్పటి మున్సిపల్ మంత్రిగా ఫైల్‌పై సంతకం చేసినందుకు నిందితుడుగా చేర్చారు. అరవింద్ కుమార్ ఫైల్ పెట్టారు, కేటీఆర్ ఫైల్‌పై సంతకం చేశారు. అంత మాత్రాన నిందితుడిగా చేరుస్తారా. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ లబ్ధి పొందలేదు. అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది. విదేశీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకోవద్దు అని నిబంధన ఉందా? అలా నిబంధన ఉంటే కేటీఆర్ తప్పు చేసినట్టు.. కానీ ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే తప్పు ఎలా అవుతుంది' అని కేటీఆర్ తరపు న్యాయవాది వాదించారు.