Vemulawada Kalyanam: వేములవాడలో నేడు శివ పార్వతుల కళ్యాణం... భారీగా తరలి వచ్చిన భక్తులు.
Vemulawada Kalyanam: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ లో శివకళ్యాణ మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే మహోత్సవాల్లో భాగంగా సోమవారం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు. రాజన్న సన్నిధికి భారీగా శివపార్వతులు భక్తులు తరలివచ్చారు.
Vemulawada Kalyanam: వేములవాడలో ప్రతియేటా మహాశివరాత్రి తర్వాత శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి ఈనెల 16 నుంచి 20 వరకు ఐదు రోజులపాటు శివకళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వస్తి పుణ్యవాచనం, అంకురార్పణం, చండీ ప్రతిష్ట, దేవత ఆహ్వానం, కలశ ప్రతిష్ట నిర్వహించారు.
సోమవారం ఉదయం 11లకు వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. అందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శివపార్వతులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 19 న పట్టణ పురవీధుల్లో రథోత్సవం, 20న ధర్మగుండంలో త్రిశూల యాత్ర, రాత్రి అద్దాల మండపంలో డోలోత్సవం నిర్వహిస్తారు.
శివకళ్యాణం ప్రత్యేక..
రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాల్లో కారణాగమము అనుసరించి మహాశివరాత్రి పర్విదినం రోజునే శివకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. వేములవాడలో మాత్రం స్మార్థ వైదిక పద్దతిని అనుసరించి మహాశివరాత్రి జాతర అనంతరం కామదహనం మరుసటి రోజున పార్వతీ రాజరాజేశ్వరుల వివాహం జరుపుతారు. ఈ శివ కళ్యాణానికి శివపార్వతులుగా పిలువబడే జోగినీలు, హిజ్రాలు, దారణ చేసుకున్న శివపార్వతులు పెద్ద సంఖ్యలో వేములవాడ కు చేరుకుని శివుడితో పరిణయం ఆడుతారు.
త్రిశూలమే భర్త... లింగంకాయనే తాళిబొట్టు.
శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి కళ్యాణం సందర్భంగా శివపార్వతులు శివుడిని పెళ్ళి చేసుకుంటారు. పెద్ద ఎత్తున తరలివచ్చే శివపార్వతులు కళ్యాణ వేదిక ముందు స్త్రీపురుష వయోభేదం లేకుండా త్రిశూలమే భర్తగా భావిస్తు లింగం కాయ తాళిబొట్టుగా పరిగణిస్తు త్రిశూలానికి బాసికం కట్టి లింగం కాయ మెడలో వేసుకుని తమకు తాము అక్షింతలు వేసుకుంటు శివుడితో పెళ్ళి అయినట్లు భావిస్తారు. ఇంట్లో ఒంట్లో బాగలేనివారు ముందుగా జంగమయ్య వద్ద దారణ చేసుకుని శివపార్వతులుగా మారి శివ కళ్యాణ తంతును నిర్వహిస్తారు. ఏళ్ళ తరబడి వేములవాడలో ఈ ఆచారం కొనసాగుతుంది.
శ్రీరామనవమి రోజున...
వేములవాడలో శివకళ్యాణోత్సవానికి రాని శివపార్వతులు శ్రీరామ నవమి రోజున జరిగే సీతారాముల కళ్యాణానికి హాజరవుతారు. ఆ రోజున రాజన్న సన్నిధిలో ఓ వైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే అదే శుభముహూర్తాన శివపార్వతులు శివుడితో వివాహం అయినట్లు బావిస్తారు. త్రిశూలానికి బాసికం కట్టి లింగం కాయ మెడలో వేసుకుని తమకు తాము అక్షింతలు, తలంబ్రాలు వేసుకుని శివుడితో వివాహం అయినట్లు పరిగణిస్తారు.
అయితే ఆరోజు వేలాదిమంది శివపార్వతులు రావడం సీతారాముల కళ్యాణానికి కొంత ఇబ్బందిగా మారడంతో ఆలయ అధికారులు పూజారులు శివపార్వతుల కళ్యాణాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. మహాశివరాత్రి తర్వాత శ్రీరామనవమికి ముందు శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే శివపార్వతులు ఈ శివ కళ్యాణానికి కొంతమంది, శ్రీరామ నవమికి మరి కొంత మంది వచ్చి కళ్యాణోత్సవంలో పాల్గొనడం అనాదిగా కొనసాగుతుంది. రెండుసార్లు వచ్చే శివపార్వతులతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం