YSRTP Sharmila: సిడబ్ల్యుసి భేటీ కంటే ముందే కాంగ్రెస్‌లోకి షర్మిల
YSRTP Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై త్వరలో సస్పెన్స్ వీడనుంది. హైదరాబాద్‌లో జరిగే సిడబ్ల్యుసి సమావేశాల కంటే ముందే షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నెల 15న సోనియా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
YSRTP Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగనున్నాయి. వాటిలో పాల్గొనేందుకు సోనియా, రాహుల్ హైదరాబాద్ రానున్నారు. వారి రాకకు ముందే షర్మిలను పార్టీలో చేర్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది.
15వ తేదీ సాయంత్రం సోనియా, రాహుల్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఢిల్లీకి వెళ్లి వారి సమక్షంలో పార్టీలో చేరతారా, హైదరాబాద్‌లో చేరుతారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయంలో ఏఐసీసీ నాయకులతో జరిపిన చర్చల్లో అంగీకారం కుదిరింది. తెలంగాణ కాంగ్రెస్‌లో కొనసాగడానికి షర్మిల ఆసక్తి చూపుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరికొందరు నేతలు మాత్రం తెలంగాణ కాంగ్రెస్ షర్మిల చేరికపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
2018 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని, షర్మిలను తెలంగాణ కాంగ్రెస్‌లో చేర్చుకోవడం వల్ల కూడా అలాంటి ప్రభావమే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు అభ్యంతరాల మాటెలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంలో చర్చలు కొలిక్కి వచ్చాయని, 15వ తేదీన సోనియా సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని వైఎస్సార్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.
మరికొందరు నేతల చేరిక…
బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి ఈ నెల 16న రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి 52 మంది వరకు నేతలు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో షర్మిలను చేర్చుకోవద్దంటూ టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్థన్‌రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఓ లేఖలో కోరారు. తెలంగాణ కాంగ్రెస్‌లో షర్మిలకు అవకాశం కల్పిస్తే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో తన పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు.