YSRTP Sharmila: సోనియాతో షర్మిల భేటీ.. కేసీఆర్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైందని వ్యాఖ్య-sharmila says kcr countdown has started in telangana ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Sharmila Says Kcr Countdown Has Started In Telangana

YSRTP Sharmila: సోనియాతో షర్మిల భేటీ.. కేసీఆర్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైందని వ్యాఖ్య

ఢిల్లీలో సోనియాతో భేటీ అయిన షర్మిల
ఢిల్లీలో సోనియాతో భేటీ అయిన షర్మిల

YSRTP Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ విలీనం వార్తల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

YSRTP Sharmila: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. గత కొంత కాలంగా షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో సోనియాతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఆగష్టు 11న రాహుల్‌ గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. అంతకు ముందు రెండు సార్లు కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు డికె.శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. శివకుమార్‌ను అభినందిస్తూ షర్మిల బెంగుళూరు వెళ్లినప్పటి నుంచి ఆమె కాంగ్రెస్‌ గూటికి చేరుతారని ప్రచారం మొదలైంది. వాటిని ఆమె తోసిపుచ్చినా చివరకు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి.

గురువారం బ్రేక్‌ ఫాస్ట్ సమయంలో సోనియా గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్‌ గాంధీతో కూడా పూర్తిగా చర్చించినట్లు షర్మిల చెప్పారు. చాలా విస్తృతంగా తమ చర్చలు జరిగినట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసేలా రాజశేఖర్‌ రెడ్డి బిడ్డ నిరంతరం పనిచేస్తుందన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైందన్నారు.

పుష్కర కాలం క్రితం జగన్‌ చేపట్టిన ఓదార్పు యాత్రను నిలిపివేయాలని సోనియా ఆదేశించారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి జగన్ సోనియాతో అప్పట్లో భేటీ అయ్యారు. ఓదార్పును విరమించుకోవాలని ఆదేశించిన సమయంలో షర్మిల, జగన్‌ను ఆమె ఆదేశాలను ధిక్కరించినట్లు ప్రచారం జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

విలీనం దిశగా అడుగులు…

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆగష్టు 11న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనంపై ప్రాథమికంగా చర్చలు జరిగాయి. షర్మిల పాలేరు నుంచి అసెంబ్లీ బరిలోకి దిగనున్నారని ప్రచారం జరుగుతోంది.

వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. షర్మిల కోరిక మేరకు తెలంగాణలో ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం షర్మిల సేవలను ఏపీలోనూ వాడుకోవాలని భావిస్తోంది.

ఏపీ, తెలంగాణలోనూ కీలక బాధ్యతలు

కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్.. నెక్ట్స్ తెలంగాణను టార్గెట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కలిసి వచ్చే ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. పార్టీలో వచ్చే వారి కోసం గేట్లు ఎత్తిన కాంగ్రెస్...టికెట్లపై హామీలు కూడా ఇచ్చేస్తోంది. అందులో భాగంగానే వైఎస్ షర్మిలతో కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. పార్టీ విలీనంపై షర్మిల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఏపీ, తెలంగాణలోనూ షర్మిల సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్ గా షర్మిలను రంగంలోకి దించాలని అధిష్ఠానం భావిస్తోందని సమాచారం.

WhatsApp channel