Shadnagar CI: షాద్‌నగర్ సిఐపై వేటు, చోరీ కేసులో దళిత మహిళపై స్టేషన్లో టార్చర్, విచారణకు ఆదేశించిన సీఎం
Shadnagar CI: కస్టడీలో ఉన్న దళిత మహిళను హింసించినందుకు షాద్‌నగర్ సిఐ రామిరెడ్డిపై వేటు పడింది. జూలై 24న షాదర్‌నగర్ పోలీస్ స్టేషన్లో దళిత మహిళను హింసించారనే ఆరోపణలపై సిఐపై పోలీస్ ఉన్నతాధికారులు వేటు వేశారు.
Shadnagar CI: తెలంగాణలో సంచలనం సృష్టించిన దళిత మహిళ కస్టోడియల్ టార్చర్ ఘటనలో సిఐపై వేటు పడింది. షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో జూలై 24న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో సీఐ రామిరెడ్డిపై బదిలీ వేటు పడింది.సీఐని సైబరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులిచ్చారు. సీఐపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరుగుతోందని, విచారణ నివేదిక అధారంగా చర్యలు తీసుంటామని సీపీ తెలిపారు.
ఏమి జరిగింది అంటే...
జూలై 24న షాద్‌నగర్‌లోని అంబేడ్కర్ కాలనీకి చెందిన సునీత,భీమయ్య దంపతుల్ని దొంగతనం ఫిర్యాదుపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి ఇంటికి సమీపంలో ఉండే నాగేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత సునీత భర్త భీమయ్యను వదిలేసిన డిటెక్టివ్ సీఐ రామిరెడ్డి, సిబ్బంది సునీతను ఆమె కుమారుడి ముందే కొట్టడంతో తీవ్రంగా గాయపడింది.ఈ వ్యవహారంపైపెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
షాద్‌నగర్ అంబేడ్కర్ నగర్ దళితవాడలో నివసించే నాగేందర్ ఇంట్లో 22.5 తులాల బంగారం, రూ.2లక్షల నగదు చోరీ జరిగాయని జులై 24న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాగేందర్ ఎదురింట్లో భీమయ్య,సునీత (35) కుటుంబం నివాసం ఉంటోంది. కూలి పనులు చేసి జీవించే వీరిపై అనుమానంతో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రామిరెడ్డి జులై 26వ తేదీన పోలీస్‌స్టేషన్‌కు పిలిచారు.తాము చోరీ చేయలేదని చెప్పడంతో అదే రోజు ఇంటికి పంపేశారు.30వ తేదీ రాత్రి 8.30కు బాధితురాలు సునీతను పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రంగా కొట్టారని ఆరోపించారు.
నాగేందర్ ఇంట్లో చోరీ జరిగిన మర్నాడు తెల్లవారుజామున తమ ఇంటి ముందు బంగారం, నగదు కనిపించాయని వాటిని చూస్తున్న క్రమంలో నాగేందర్ కుటుంబసభ్యులు తనపై దాడి చేశారని 30వ తేదీ రాత్రి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి, దొంగతనం గురించి ప్రశ్నించారని, ఆ తర్వాత కుమారుడి ముందే తీవ్రంగా హింసించారని దుస్తులు విప్పేసి, నిక్కరు, తన భర్త చొక్కాను తనకు తొడిగి తీవ్రంగా కొట్టారని బాధితురాలు ఆరోపించింది. రాత్రి 2 గంటల వరకు చితక బాదడంతో స్పృహ కోల్పోవడంతో ఫిర్యాదుదారుడికి చెందిన వాహనంలోనే ఇంటికి పంపించారని, తర్వాత రోజు స్టేషన్‌కు వెళితే పిలిచినపుడు రావాలని పంపేశారని వాపోయింది.
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఘటనపై దుమారం రేగడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. మరోవైపు ఈఘటనలో 3 తులాల బంగారం, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు షాద్‌నగర్ పోలీసులు తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి.. షాద్‌నగర్ ఘటన గురించి తెలియగానే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు.ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయించాలని ఆదేశించారు.బాధ్యులైన వారిని విధుల నుంచి తప్పించి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయాలని ఆదేశించారు.మరోవైపు తెలంగాణలో పోలీసుల కూృరత్వాన్ని బీఆర్‌ఎస్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. బాధితురాలిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్లు పరామర్శించారు.