హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం-sfi alliance wins in hyderabad central university student elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Sfi Alliance Wins In Hyderabad Central University Student Elections

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం

HT Telugu Desk HT Telugu
Feb 26, 2023 08:51 AM IST

హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ విధ్యార్థి ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సాధించింది. అధ్యక్షులుగా ప్రజ్వల్, ప్రధాన కార్యదర్శిగా కృప మరియజార్జ్ ఎన్నికయ్యారు.

ఎస్ఎఫ్ఐ కూటమి విజయం
ఎస్ఎఫ్ఐ కూటమి విజయం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కూటమి భారీ విజయం నమోదు చేసింది. అన్ని స్థానాలనూ కైవసం చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

హెచ్సీయూ నూతన అధ్యక్షులు ప్రజ్వల్, ఉపాధ్యక్షులుగా పృథ్విసాయి, ప్రధాన కార్యదర్శిగా కృప మరియజార్జ్, జాయింట్ సెక్రెటరీగా కత్తి గణేష్, కల్చరల్ సెక్రెటరీగా లిఖిత్ కుమార్, స్పోర్ట్స్ సెక్రెటరీగా సిహెచ్ జయరాజు గెలు పొందారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఎస్ఎఫ్ఐ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అన్ని రౌండ్లలోనూ ముందంజలో ఉంది. అన్ని స్థానాల్లోనూ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఏ-డీఎస్ యూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

అధ్యక్షులుగా పోటీ చేసిన వారిలో ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి ప్రజ్వల్‌కు 1,838 ఓట్లు, ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,250 ఓట్లొచ్చాయి. ప్రజ్వల్ 588 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఉపాధ్యక్ష పదవికి ఎస్ఎఫ్ఐ కూటమి నుంచి పృథ్విసాయికి 1,861 ఓట్లు లభించగా, ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,163 ఓట్లు వచ్చాయి. 708 ఓట్ల తేడాతో పృథ్వి సాయి విజయం సాధించారు.

ప్రధాన కార్యదర్శి పోస్టుకు పోటీ చేసిన ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి కృప మరియ జార్జ్’కు 2,076 ఓట్లు పడ్డాయి. ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,185 ఓట్లు వచ్చాయి. కృప మరియ జార్జ్ 892 ఓట్ల మెజార్టీతో విజయకేతనం ఎగురవేశారు. స్పోర్ట్స్ సెక్రెటరీగా ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి సిహెచ్ జయరాజుకు 1,544 ఓట్లొచ్చాయి. ఏబీవీపీ కూటమి అభ్యర్థి 1,377 ఓట్లు సంపాదించారు. 177 ఓట్ల తేడాతో జయ రాజు గెలిచారు. జాయింట్ సెక్రెటరీ పోస్టుకు ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థి కత్తి గణేష్‌కు 1,578 ఓట్లు వచ్చాయి. ఏబీవీపీ కూటమి అభ్యర్థికి 1,011 ఓట్లు పడ్డాయి. 567 ఓట్ల తేడాతో గణేష్ విజయం సాధించారు.

హెచ్సీయూ విద్యార్థి సంఘ ఎన్ని‌కల్లో వరుసగా రెండోసారి ఎస్ఎఫ్ఐ కూటమి విజయం సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో గెలిచిన వారికి ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.పి.సాను, మయూక్ బిశ్వాస్, రాష్ట్ర అధ్యక్షులు ఆ.ర్ఎల్.మూర్తి, కార్యదర్శి టి నాగరాజు అభినందనలు తెలిపారు.

ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థులు
ఎస్ఎఫ్ఐ కూటమి అభ్యర్థులు

గెలిచిన అభ్యర్థులతో విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మొత్తం 5,133 ఓట్లలో 3,925 మంది విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

కాగా అంతకు ముందు శుక్రవారం హెచ్‌సీయూ రణరంగంగా మారింది. తమపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని ఎఫ్‌ఎఫ్‌ఐ కూటమి నేతలు ఆరోపించారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. శుక్రవారం విద్యార్థి సంఘాల ఎన్నికలు జరగ్గా.. అదే రోజు అర్ధరాత్రి ఏబీవీపీ నాయకులు తమపై దాడికి దిగినట్టు ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శివ దుర్గారావు మాట్లాడుతూ.. ఏబీవీపీ నాయకులు తమపై క్రూరంగా దాడి చేశారని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఎఫ్‌ హాస్టల్‌ లోపలికి చొరబడి దాడికి తెగబడ్డారని విమర్శించారు. మద్యం మత్తులో ఏబీవీపీ విద్యార్థి సంఘం సభ్యులు తమను దుర్భాషలాడుతూ గొడవకు దిగారని, హాస్టల్‌పై దాడి చేసి అద్దాలు పగులగొట్టారని తెలిపారు. 

WhatsApp channel