Telangana Rains : అకాల వర్షంతో ఆగమాగం.... ఆందోళనలో అన్నదాతలు..! ఇవాళ కూడా వర్షాలు-severe hailstorms in several districtsof telangana causing widespread damage ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rains : అకాల వర్షంతో ఆగమాగం.... ఆందోళనలో అన్నదాతలు..! ఇవాళ కూడా వర్షాలు

Telangana Rains : అకాల వర్షంతో ఆగమాగం.... ఆందోళనలో అన్నదాతలు..! ఇవాళ కూడా వర్షాలు

Rains in Telangana: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం తర్వాత ఉత్తర తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. భారీస్థాయిలో ధాన్యం తడిసిపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక హైదరాబాద్ నగరంలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది.

తెలంగాణలో వర్షాలు

తెలంగాణలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం ఉత్తర తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. అంతేకాకుండా… ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం రావటంతో… పంట నష్టం వాటిల్లింది. వడగళ్లు కురిసి అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వరిపంటతో పాటు మామిడి కాయలు, పూత రాలిపోయాయి.

మంచిర్యాల లక్షేట్టిపేట మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. ఇక కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం పడింది. దీంతో ఆలయ పరిసరాల్లో భారీగా వరద నీరు పారింది. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో కుండపోత వర్షం కురిసింది. ఈ అకాల వర్షాలతో రైతులు… ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రోడ్లపై ఉన్న చెట్లు కూలిపోయి… ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల రేకుల షెడ్లు గాలికి ఎగిరి దూరం పడిపోయాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం పడింది. ఇందల్వాయి, ఇందల్వాయి మండలాల్లోని కొన్నిచోట్ల వడగళ్ల వాన పడింది. దీంతో వరి ధాన్యం నేలరాలాయి.

కొమురంభీం జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో పలుచోట్ల చెట్లు నేల కూలాయి. కాగజ్‌నగర్‌ మండలంలో 33 కేవీ విద్యుత్‌ లైన్ తెగిపోవటంతో.. పలు మండలాలకు కరెంట్ నిలిచిపోయింది.

అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురి చేసింది. గాలి వానకు మామిడికాయలు రాలిపోయాయి చేతికందే దశలో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల వరి పంట నేలవాలింది. చొప్పదండి మార్కెట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న మొక్కజొన్నలు తడిసిపోయాయి. అకాల వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందారు. మరో రెండు రోజులపాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో పంటలు చేతి కందుతాయో లేదోనని ఆవేదన చెందుతున్నారు.

హైదరాబాద్ లో వర్షం…

హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి వేళ వర్షం మొదలైంది. పటాన్ చెరు, లింగంపల్లి, మాదాపూర్, చందానగర్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వడగాళ్ల వాన కురిసింది. దీంతో పలు కాలనీల్లో వరద పారింది. అంతేకాకుండా దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, ఎల్బీ నగర్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి ప్రాంతాల్లో భారీగా గాలి వీస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి.

ఇవాళ తెలంగాణలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతారవణ కేంద్రం అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తు చర్యలు చేపట్టాలని అప్రమత్తం చేశారు. వెంటనే సంబంధిత జిల్లాల కలెక్టర్ల తో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు.

అప్రమత్తంగా ఉండండి - సీఎస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. వడగళ్ల వాన వలన నెలకొన్న పరిస్థితులను ఆమె అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యలు అందించాలన్నారు.

రానున్న 48 గంటలలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచన ఉన్నందున అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సీఎస్ ఆదేశించారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అకాల వర్షాల వలన ఏర్పడే నష్టాల అంచనాలను ఏప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు అందించాలన్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం