South Central Railway : దయచేసి వినండి.. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ బంద్ అయ్యిందండి!
South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో చాలాచోట్ల మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికులు గమనించి, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.
సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు.. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ రైలును రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. 11 రోజుల పాటు ఈ రైలు సేవలు నిలిచిపోనున్నాయి. పలుచోట్ల థర్డ్ ట్రాక్ నిర్మాణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు.
ప్రయాణికుల ఇబ్బందులు..
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు ఎక్కువగా భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం సాగిస్తుంటారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఈ ట్రైన్ అనుకూలంగా ఉంటుంది. దీన్ని రద్దు చేయడంతో.. వీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరైలు సికింద్రాబాద్ జంక్షన్- కాగజ్‌నగర్ మధ్య.. బీబీనగర్, భువనగిరి, ఆలేర్, జనగాం, రఘునాథ్‌పల్లి, ఘన్‌పూర్, కాజీపేట జంక్షన్, హసన్‌పర్తి రోడ్, ఉప్పల్, జమ్మికుంట,పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లలో ఆగుతుంది.
30 రైళ్లు రద్దు..
అటు ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా.. 30 రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు రద్దు చేశారు. గోల్కొండ, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్‌లు వారం నుంచి 11 రోజుల పాటు రద్దు అయ్యాయి. మరో 9 రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు.
గోల్కొండ.. శాతవాహన..
సికింద్రాబాద్- గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్.. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21 వరకు రద్దు అయ్యింది. ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, గుంటూరు- సికింద్రాబాద్ (12705/12706) 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో రద్దైంది. శాతవాహన ఎక్స్‌ప్రెస్, విజయవాడ- సికింద్రాబాద్ (12713/12714) 11, 14, 16, 18, 19, 20 తేదీల్లో రద్దు అయ్యింది.
వందేభారత్ ఆలస్యం..
సికింద్రాబాద్- విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్ ప్రెస్.. ఈనెల 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా నడవనుంది. ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ ప్రెస్.. 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాల ఆలస్యంగా నడవనుందని అధికారులు వెల్లడించారు.