Siricilla Police: నక్సలైట్ల పేరుతో సెటిల్ మెంట్ దందాలు…మహిళ కిడ్నాప్ కేసులో ఆరుగురి అరెస్ట్
Siricilla Police: నక్సల్స్ ముసుగులో సెటిల్ మెంట్ దందాలు నిర్వహించే మాజీ నక్సలైట్ దంపతులతో పాటు ఆరుగురిని రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పట్టుబడ్డ వారు ప్రేమించి పెళ్ళి చేసుకున్న జంటను విడకొట్టేందుకు ప్రియురాలు కిడ్నాప్ కేసుతో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు.
Siricilla Police: నక్సల్స్ ముసుగులో సెటిల్ మెంట్ దందాలు నిర్వహించే మాజీ నక్సలైట్ దంపతులతో పాటు ఆరుగురిని రాజన్న సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారు.
సిరిసిల్ల లో ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన జక్కు ధరణి… బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు కమటం కృష్ణవంశీ ప్రేమించుకున్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ప్రేమ పెళ్ళి ధరణి తల్లిదండ్రులకు ఇష్టంలేందున ఎలాగైనా తమ కూతురి మనసు మార్చి తమ కులం వారికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు.
కోనరావుపేట కు చెందిన ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఉండే గొట్టే పద్మ ఆమె భర్త మనోహర్ మాజీ నక్షలైట్ లను ధరణి తల్లి లక్ష్మీ, సోదరుడు రాజశేఖర్ సంప్రదించారు. ఆ మాజీ నక్సల్స్ దంపతులు పద్మ మనోహర్ ఐదు లక్షల రూపాయలు ఇస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఒప్పదం చేసుకున్నారు.
కళ్ళలో కారం కొట్టి కిడ్నాప్...
ఒప్పందం ప్రకారం మాజీలు ఇద్దరు దరణిని కిడ్నాప్ చేయడానికి సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నారు. ధరణి అమ్మ లక్ష్మి అన్న రాజశేఖర్ మర్రిగడ్డ గ్రామానికి చెందిన కత్తి రాము, వేములవాడ గ్రామానికి చెందిన ఎక్కలదేవి బాలకిషన్, టిల్లు, జగదీష్ ల సహాయంతో పకడ్బందీ ప్రణాళిక తయారు చేశారు.
ఎర్టిగా కారు కిరాయి తీసుకొని ఈనెల 22న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బూర్గుపల్లి అత్తగారి ఇంట్లో ధరణి ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయగా ధరణి ఆడపడుచు ఆపడానికి ప్రయత్నం చేసింది. వారి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి దరణిని బలవంతంగా కామారెడ్డి అక్కడి నుండి నిజామాబాద్ జిల్లాలోని చుండూరు గ్రామం, అక్కడి నుండి నాందేడ్ వైపు తీసుకువెళ్లి ధరణి మనసు మార్చాలని ప్రయత్నం చేశారు.
రంగంలోకి దిగిన స్పెషల్ టీం...
ధరణి కిడ్నాప్ తో అత్తింటివారు బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా కిడ్నాపర్ లు భయపడి ధరణిని బూరుగుపల్లి గ్రామశివారులో వదిలిపెట్టారు.
అమ్మాయి ధరణి బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి జరిగిన ఘటన గురించి వివరించడంతో పోలీసులు మాజీ నక్సలైట్ లు గొట్టె పద్మ, మనోహర్, దరణి తల్లి జక్కులక్ష్మీ , సోదరుడు జక్కు రాజశేఖర్, కత్తి రమేష్ @ రాము, ఎక్కలదేవి బాలకృష్ణ లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న టిల్లు జగదీష్ @జగ్గూ కోసం ప్రత్యేక టీమ్ గాలిస్తుందని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.
మాజీలపై నాలుగు జిల్లాల్లో కేసులు..
కొనరావుపేట మండలనికి చెందిన ప్రస్తుతం కామారెడ్డి లో ఉంటున్న మాజీ నక్సలైట్ గొట్టే మనోహర్ అతని భార్య గొట్టే పద్మ ఇద్దరు ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆ ఇదైదరిపై రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో పలు కేసులు నమోదు కావడం జరిగిదని చెప్పారు.
గొట్టే పద్మ, మనోహర్ లకి సంబంధించిన బాధితులు ఎవరైనా ఉంటే సబంధిత పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయాలని కోరారు. మాజీ నక్సలైట్ల పేరుతో బెదరింపులకు పాల్పడే వారి సమాచారం పోలీసులకు అందించాలని, అలాంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటమని ఎస్పీ స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)