Phone Tapping Case : ఇజ్రాయెల్ నుంచి పరికరాలు, రేవంత్ ఇంటిపై నిఘా..? ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తున్న కీలక విషయాలు-sensational facts revealed in telangana phone tapping case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Sensational Facts Revealed In Telangana Phone Tapping Case

Phone Tapping Case : ఇజ్రాయెల్ నుంచి పరికరాలు, రేవంత్ ఇంటిపై నిఘా..? ట్యాపింగ్ కేసులో వెలుగు చూస్తున్న కీలక విషయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 27, 2024 03:22 PM IST

Telangana Phone Tapping Case Updates : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పక్కా ప్లాన్ తోనే ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కీలక నేతలను ప్రధానంగా టార్గెట్ చేసినట్లు ప్రాథమికంగా తేలింది.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు (image from unsplash.com)

Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)… ప్రస్తుతం తెలంగాణలో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు అరెస్ట్ కావటంతో… ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ప్రణీత్ రావు అరెస్ట్ తో మొదలైన ఈ వ్యవహారంలో ఇద్దరు అదనపు ఎస్పీలు కూడా అరెస్ట్ అయ్యారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నతస్థాయి అధికారితో పాటు మరికొందరికి నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. 

ట్రెండింగ్ వార్తలు

గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అధికారంలోకి ఉంది. ఈ సమయంలో… ప్రధానంగా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డితో పాటు మరికొందరి నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరేకాకుండా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేసి… డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు గట్టిగా వస్తుండటంతో…. బీఆర్ఎస్ పార్టీకి ఈ వ్యవహారం అతిపెద్ద సవాల్ గా మారింది. ఈ నిఘా చాటున బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఫండ్స్ వచ్చాయన్న వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురు సీనియర్ పోలీసు అధికారులను అరెస్టు అయ్యారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు అదనపు ఎస్పీలు ఉన్నారు.  మొదటగా ఎస్ఐబీ డీఎస్సీ ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. 

పలు వర్గాల సమాచారం ప్రకారం….. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలో సాంకేతిక సలహాదారుగా ఉన్న రవి పాల్… ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి (ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి) సంభాషణలను వినడానికి కావాల్సిన ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసేందుకు సహకరించినట్లు సమాచారం.  ఇజ్రాయెల్ నుంచి వీటిని కొనుగోలు చేసినట్లు రవిపాల్ పై అభియోగాలు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పరికరాల దిగుమతికి సంబంధించి కేంద్రం నుంచి ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదని దర్యాప్తు అధికారుల బృందం గుర్తించింది. రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఏర్పాటు చేసిన ఈ తరహా నిఘా వ్యవస్థతో 300 మీటర్ల పరిధిలో మాట్లాడే ఏదైనా వినవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రవిపాల్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మీడియా సంస్థ నిర్వహకుడు శరణ్ రావుతో పాటు  సిటీ టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారి రాధా కిషన్ రావు కోసం కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

ఈ కేసులో ఉన్న ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఇటీవలే అరెస్ట్ అయిన అదనపు ఎస్పీలు రిమాండ్ లో ఉన్నారు. వీరిని కస్టడీకి తీసుకునే యోచనలో సిట్ బృందం ఉంది. ఇక ప్రభాకర్ రావును ఇక్కడికి రప్పించి…. విచారించే దిశగా సిట్ అడుగులు వేస్తోంది. 

ఇక ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… `బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయి. మా నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కఠినంగా వ్యవహరించాలి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలి. ఫోన్ ట్యాపింగ్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలి. ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు. ట్యాపింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్రమైంది, ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు బయట పడుతున్నాయి. నిర్లక్ష్యం వహించకుండా ట్యాపింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి." అని ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేటీఆర్ రియాక్షన్….

KTR On Phone Tapping: ఈ కేసు వ్యవహారంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్లు చూపిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రజా సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారంటూ లీకులు ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. పెన్షన్లు, రైతుబంధుతో పాటు మరిన్ని సమస్యలను పక్కదోవ పట్టించేందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఉన్నది రేవంత్ రెడ్డినే కాబట్టి.... లీకులు ఆపివేసి చర్యలు తీసుకోవాలని వ్యాఖ్యానించారు.

WhatsApp channel