Hyderabad Double Murder Case : జంట హత్య కేసులో సంచలన విషయాలు.. వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని..-sensational details in the hyderabad narsingi double murder case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Double Murder Case : జంట హత్య కేసులో సంచలన విషయాలు.. వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని..

Hyderabad Double Murder Case : జంట హత్య కేసులో సంచలన విషయాలు.. వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని..

Basani Shiva Kumar HT Telugu
Jan 17, 2025 11:34 AM IST

Hyderabad Double Murder Case : హైదరాబాద్ నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగిందని అంతా భావించారు. కానీ.. పోలీసుల విచారణలో మరో కీలక విషయం తెలిసినట్టు సమాచారం. వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య చేసినట్టు తెలిసింది.

ఘటనా స్థలంలో పోలీసులు
ఘటనా స్థలంలో పోలీసులు

నార్సింగి జంట హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణలో మరో విషయాన్ని గుర్తించారు. మహిళ ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ఒప్పుకోలేదని హత్య చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ప్రయత్నించగా అంగీకరించలేదు. దీంతో మహిళ, ఆమె ప్రియుడిపై కక్ష గట్టి హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు.

బిందుతో పరిచయం..

మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ ఉపాధి కోసం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడకు వచ్చాడు. హౌస్ కీపింగ్ పనిచేస్తున్న సమయంలో అతడికి ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన బిందుతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. వీరి సంబంధం తెలుసుకున్న బిందు భర్త.. వనస్థలిపురం పరిధిలోని చింతలకుంటకు మకాం మార్చాడు. అయినా బిందు, సాకేత్‌ల మధ్య బంధం కొనసాగింది

భర్తకు చెప్పకుండా..

ఈ క్రమంలోనే గచ్చిబౌలిలో నివసించే సాకేత్ స్నేహితులు రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్రకుమార్.. బిందును తమ వద్దకు తీసుకురావాలని చెప్పారు. దీంతో ఆమె జనవరి 8న భర్తకు చెప్పకుండా సాకేత్‌తో గచ్చిబౌలికి వచ్చి అతడి గదిలోనే ఉంది. రెండుసార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్.. సెల్‌ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించగా.. ఆమె అడ్డు చెప్పింది. ఇదే విషయాన్ని సాకేత్‌కు చెప్పింది

పక్కా ప్లాన్‌తో..

సాకేత్.. రాహుల్‌ను గట్టిగా హెచ్చరించడంతో గొడవ జరిగింది. కక్ష గట్టిన రాహుల్.. బిందు, సాకేత్‌లను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాజ్, సుఖేంద్రల సాయం తీసుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం.. రాహల్ ఈ నెల 11న సాకేత్ ద్వారా బిందును మరోసారి పిలిపించుకున్నాడు. అదేరోజు రాహుల్, రాజ్, సుఖేంద్రలు సాకేత్, బిందులను ఆటోలో పుప్పాలగూడ అనంత పద్మస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అందరూ మద్యం తాగుతుండగా సుఖేంద్ర.. బిందును పక్కకు తీసుకెళ్లాడు.

కత్తితో పొడిచి..

సాకేత్ ఒంటరిగా ఉండడంతో.. అదే అదనుగా భావించిన రాహుల్, రాజ్ కుమార్లు కత్తితో పొడిచి బండరాయితో కొట్టి చంపారు. ఆ తర్వాత బిందును హతమార్చారు. అనంతరం నిందితులు జనవరి 12న మధ్యప్రదేశ్‌లోని సొంతూరికి పారిపోయారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ గుర్తించిన పోలీసులు.. ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్‌కు పంపించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Whats_app_banner