Vikarabad : అధికారులపై దాడి కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు.. బీఆర్ఎస్‌పై అనుమానాలు!
Vikarabad : రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం అడ్డాలో.. అధికారులపై దాడి కేసు సంచలనం అయ్యింది. అయితే.. ఈ ఘటనలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న సురేష్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. దాడి జరగక ముందు.. జరిగిన తర్వాత.. మొత్తం 42సార్లు మాజీ ఎమ్ల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు.
ఇటు అధికారులపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. అధికారులపై దాడి చేసిన వారితో పాటు.. గ్రామస్తులపై నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో.. లా అండ్ ఆర్డర్ సమీక్షకు వికారాబాద్ వెళ్లాలని ఏడీజీ మహేష్ భగవత్‌ను డీజీపీ ఆదేశించారు. ఏడీజీ మహేష్ భగవత్ వికారాబాద్‌కు వెళ్లనున్నారు. దాడి ఘటనపై మహేష్ భగవత్ నివేదిక ఇవ్వనున్నారు.
ఈ ఘటనపై బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పందించారు. 'వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిని అక్కడి రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా భూములు గుంజుకోకండి, మా ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా.. ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు' అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
'దీనిని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు, గ్రామ సభలను బహిష్కరించారు. స్వయంగా ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసింది. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని అడ్డం పెట్టుకొని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాలలో మోహరించి అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది' అని ఈటల స్పష్టం చేశారు.
'అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నాము. భూ సేకరణ రైతుల ఇష్ట ప్రకారం చేయాలి తప్ప.. బలవంతంగా తీసుకునే అధికారం మీకు ఇవ్వలేదు. గతంలో ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం 8 లక్షలకు భూములు సేకరించి కోటి రెండు కోట్లకు ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేసిననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. బీజేపీగా మేము కూడా వ్యవహరించే వ్యతిరేకించాము. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు' అని ఈటల ఆరోపించారు.
'ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి. కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదు' అని ఈటల ఫైర్ అయ్యారు.
'నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదు. ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికంపై ప్రభుత్వం చేస్తున్న దుచ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నాం. ప్రజలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుదాం. మేమంతా మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము' అని ఈటల స్పష్టం చేశారు.