రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి - అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియామకం-senior journalist ireddy srinivas reddy appointed as chairman of assembly media advisory council ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి - అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియామకం

రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి - అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియామకం

రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి అధ్యక్షుడుగా సీనియర్ జర్నలిస్టు ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. మొత్తం 15 మందితో మీడియా సలహా మండలిని ఏర్పాటు చేశారు.

సీనియర్ జర్నలిస్టు ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు, ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

16 ఏళ్లుగా జర్నలిస్ట్ ప్రయాణం….

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఐ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దాదాపు 16 సంవత్సరాలకు పైగా జర్నలిస్టుగా పని చేస్తున్నారు. గతంలో ఆంధ్రజ్యోతి, సాక్షి, డెక్కన్ క్రానికల్ పత్రికల్లో వివిధ హోదాల్లో పని చేశారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై సంపూర్ణ అవగాహన కలిగిన శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆంగ్ల పత్రికలో పొలిటికల్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. స్పీకర్ ఉత్తర్వుల ప్రకారం రెండేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

తనను అసెంబ్లీ మీడియా సలహా మండలి అధ్యక్షుడిగా నియమించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.

15 మందితో కమిటీ - సభ్యులు వీరే…

15 మందితో ఏర్పాటు చేసిన మీడియా సలహా మండలికి చైర్మన్ గా ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పని చేయనున్నారు. కో - చైర్మన్ గా పోలోజు పరిపూర్ణాచారి నియమితులయ్యారు. సీనియర్ జర్నలిస్టులైన అయితరాజు రంగారావు, బొడ్లపాటి పూర్ణచంద్రారావు, ఎల్ వెంకట్రాం రెడ్డి, పొలంపల్లి ఆంజనేయులు, ఎం పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీమ్ వజాహత్, బసవపున్నయ్య , ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బీహెచ్ఎంకే గాంధీ కమిటీ సభ్యులుగా ఉన్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.