TG Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారుల ఎంపికకు యాప్ విడుదల.. ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీ
TG Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ‌్ళకు లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ఏడాది ఒక్కో నియోజక వర్గంలో 3500ఇళ్ల నిర్మాణాన్ని చేపడతారు. గ్రామ సభల ద్వారా ఇళ్ల నిర్మాణానికి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
TG Indiramma Illu: తెలంగాణ సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్దిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 4.5లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతారు. ఇందు కోసం ఈ ఏడాది రూ. 22,500కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో నియోజక వర్గానికి 3500 ఇళ్లను ఈ పథకం ద్వారా కేటాయిస్తారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులు రూ.5లక్షల వ్యయంతో 400 చదరపు అడుగుల ఇంటి నిర్మాణం చేపట్టవచ్చు. ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వం ఐదు లక్షల రుపాయల సాయాన్ని అందించనుంది.
ప్రజలకు ఆత్మగౌరవంతో బ్రతికే అవకాశాన్ని దేశంలో మొట్టమొదట కల్పించిన ఘనత ఇందిరా గాంధీకి దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలో లేదన్నారు. దళిత, ఆదివాసీలకు భూములపై హక్కును కల్పించి ఆత్మగౌరవాన్ని ఇందిరా గాంధీ నిలబెట్టారన్నారు. దేశంలో లక్షలాది ఎకరాల వ్యవసాయ భూమిని పేదలు, దళితులకు దక్కాయంటే ఇందిరగా గాంధీ వల్లేనని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా లభ్దిదారులను గుర్తించేందుకు మొబైల్ యాప్ సిద్ధం చేశారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా అర్హులకు మాత్రమే ఇళ్లు దక్కేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఇళ్ల నిర్మాణం చేపడుతున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో లబ్దిదారులు తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వం అందించే సాయంతో పాటు సొంతంగా తమకు నచ్చినట్టు లబ్దిదారులు ఇళ్లను నిర్మించుకోవచ్చు. నిబంధనలు ఏమి లేవని, ఇళ్ల డిజైన్ వారికి నచ్చినట్టు కట్టుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. తొలి ఏడాది నియోజక వర్గానికి 3500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. పాలనా పరమైన అమోదం కూడా ఇచ్చినట్టు తెలిపారు.
ఆదివాసీలు, ఐటీడీఏల పరిధిలో చెంచులు, ఆదివాసీ ప్రజలకు ప్రత్యేకంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గొండులు, ఆదివాసీ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఈ పథకంతో సంబంధం లేకుండా అదనంగా నిర్మిస్తామని చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఇంటి నిర్మాణాలకు ఒక మోడల్ హౌస్‌ను నిర్మిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. లబ్దిదారులు ఆ ఇళ్లను చూసి తమ ఇళ్ల డిజైన్ ఖరారు చేసుకోవచ్చని తెలిపారు.