కాళేశ్వరంలో భద్రత కట్టుదిట్టం.., 3500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు-security tightened in kaleshwaram strong security arrangements made with 3500 police personnel ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  కాళేశ్వరంలో భద్రత కట్టుదిట్టం.., 3500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

కాళేశ్వరంలో భద్రత కట్టుదిట్టం.., 3500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు

HT Telugu Desk HT Telugu

సరస్వతీ పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉత్సవాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు రెడీ అయ్యారు. తెలంగాణ పోలీసులతో పాటు ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర కు సంబంధించిన పొలీసులకు కూడా కాళేశ్వరంలో విధులు కేటాయించారు.

సరస్వతీ పుష్కరాలకు భారీగా బందోబస్తు ఏర్పాట్లు

దక్షిణ కాశీగా పేరుగాంచిన భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమంలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలకు ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

దేశ నలుమూలల నుంచి సరస్వతీ పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రానుండగా, పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు పోలీస్ అధికారులు రెడీ అయ్యారు. తెలంగాణ పోలీసులతో పాటు ఛత్తీస్ గడ్, మహారాష్ట్ర కు సంబంధించిన పోలీసులకు కూడా ఇక్కడ విధులు కేటాయించారు. ఇప్పటికే భద్రతా పరమైన ఏర్పాట్లను భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

3,500 మంది పోలీసులు

సరస్వతీ నదీ పుష్కరాలు 15వ తేదీ గురువారం నుంచి 26వ తేదీ వరకు జరగనుండగా, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ప్రతి రోజు కనీసం లక్ష మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లక్షలాదిగా తరలి వచ్చే సరస్వతీ పుష్కరాల్లో పోలీస్ బందోబస్తు చాలా కీలకం. దీంతోనే కాళేశ్వరానికి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌ గఢ్‌ పోలీసుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు చేశారు. పుష్కరాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మొత్తంగా 3,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. అంతేగాకుండా పుష్కరాల్లో మహిళలు, పిల్లల రక్షణ కోసం ప్రత్యేక మహిళా పోలీసు విభాగాలను కూడా నియమించారు. వాటితో పాటు షీ టీమ్స్‌ కూడా పని చేస్తున్నాయి. ఎవరైనా ఆకతాయిలు మహిళలు, చిన్నారులను వేధిస్తే వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆఫీసర్లు చెబుతున్నారు.

200 సీసీ కెమెరాలు

పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరం పరిసరాల్లో సీసీ నిఘాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కాళేశ్వరంలో సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడంతో పాటు కట్టుదిట్టమైన భద్రతకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు.

పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో పాటు సింగరేణి, రెస్క్యూ టీంలకు కూడా విధులు కేటాయించారు.

14 చోట్ల పార్కింగ్

కాళేశ్వరానికి వచ్చే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ ఆఫీసర్లు ముందుగా రూట్ మ్యాప్ ఇచ్చారు. హైదరాబాద్‌, వరంగల్‌ వైను నుంచి వచ్చే వెహికిల్స్ కాటారం నుంచి పలుగుల క్రాస్‌ మీదుగా కాళేశ్వరం చేరుకోవాల్సి ఉంటుంది.

కరీంనగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు మంథని, గంగారం క్రాస్‌, పలుగుల క్రాస్‌ మీదుగా; మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు సిరొంచ బ్రిడ్జి నుంచి కాళేశ్వరం రావాల్సి ఉంటుంది. కాగా వివిధ రూట్ లలో వచ్చే వాహనాల కోసం కాళేశ్వరం చుట్టూరా 14 చోట్ల పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేశారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా మరో ఏడు చోట్లా హాల్టింగ్ పాయింట్స్‌ సిద్ధం చేశారు. కాగా ఇప్పటికే ప్రారంభమైన సరస్వతీ నదీ పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనుండగా, భక్తులు, వాహన దారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీస్ ఆఫీసర్లు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం