Target Maoists : పైన డ్రోన్లు.. కింద అత్యాధునిక ఆయుధాలు.. మావోయిస్టులు తమను ఎలా రక్షించుకుంటారు?-security forces search for maoists in abujhmad forest in chhattisgarh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Target Maoists : పైన డ్రోన్లు.. కింద అత్యాధునిక ఆయుధాలు.. మావోయిస్టులు తమను ఎలా రక్షించుకుంటారు?

Target Maoists : పైన డ్రోన్లు.. కింద అత్యాధునిక ఆయుధాలు.. మావోయిస్టులు తమను ఎలా రక్షించుకుంటారు?

Basani Shiva Kumar HT Telugu
Jan 21, 2025 01:05 PM IST

Target Maoists : మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలనే లక్ష్యంతో కేంద్రం అండుగులు వేస్తోంది. ముఖ్యంగా అమిత్ షా ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. దీంతో భద్రతా బలగాలు మావోయిస్టుల కోటల్లోకి దూసుకెళ్తున్నాయి. అన్ని దారుల్లో దగ్గరకు చేరుతున్నాయి. దీంతో వారు తమను ఎలా రక్షించుకుంటారనే చర్చ జరుగుతోంది.

మావోయిస్టులు
మావోయిస్టులు

గతంతో పోలిస్తే ప్రస్తుతం మావోయిస్టుల బలంగా భారీగా తగ్గింది. ఎదురుకాల్పుల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా కొందరు ఉన్నా.. వారు వయోభారంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. లొంగిపోవాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. అదే సమయంలో ఏరివేతకు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీంతో మావోయిస్టులు తమ ప్రాణాలను ఎలా కాపాడుకుంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

yearly horoscope entry point

పెట్టని కోటలా..

ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని అబూజ్‌మడ్‌ అడవులు మావోయిస్టులకు పెట్టని కోట అనే ప్రచారం ఉంది. చాలామంది కీలక నాయకులు అక్కడే ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నారని నిఘావర్గాలు గతంలో చాలాసార్లు అనుమానించాయి. ఈ నేపథ్యంలో.. అబూజ్‌మడ్‌ అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే చుట్టుముట్టాయి. ఈ క్రమంలో వరుస ఎదురుకాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు.

పైన డ్రోన్లు.. కింద ఆయుధాలతో..

అబూజ్‌మడ్‌ అడవుల్లో భద్రతా బలగాలు పకడ్బందీగా ముందుకెళ్తున్నాయి. పైన డ్రోన్లను ఎగరేస్తూ.. సమాచారం తెలుసుకుంటున్నాయి. అదే సమయంలో కింద అత్యాధునిక ఆయుధాలతో ముందుకెళ్తున్నాయి. అన్ని మార్గాలను తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల బీజాపుర్‌ జిల్లాలో ఎదురుకాల్పులు జరగ్గా.. 16 మంది మావోయిస్టులు మరణించారు.

అక్కడే ఎందుకు..

అబూజ్‌మడ్‌ అడవులు దట్టంగా ఉంటాయి. ఎత్తైన కొండలు ఉంటాయి. ఇవి శత్రుదుర్భేద్యంగా ఉంటాయని భావించి మావోయిస్టులు దీన్ని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దంతెవాడ, నారాయణ్‌పుర్, బీజాపుర్ జిల్లాల్లో దాదాపు 4 వేల ఎకరాల్లో అబూజ్‌మడ్‌ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడికి రావడం భద్రతా బలగాలకు సాధ్యం కాదని.. మావోయిస్టు అగ్రనేతలు తలదాచుకుంటారనే ప్రచారం ఉంది.

నిరంతరం నిఘా..

ఈ అడవుల్లోనే మావోయిస్టులు ఆయుధాలను దాచిపెడతారని, కొత్తవారికి శిక్షణ ఇస్తారని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. అందుకే కొన్ని రోజులుగా అబూజ్‌మడ్‌లోకి చొచ్చుకెళుతున్నాయి. అడవి లోపల ఉన్న మావోయిస్టులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా పోలీసులతో కలిసి ఆపరేషన్లు చేస్తున్నాయి. డ్రోన్లతో నిరంతరం నిఘా ఏర్పాటు చేస్తున్నాయి.

రాత్రివేళ కూడా..

దీంతో దట్టమైన అడవుల్లో ఉన్న తాజా సమాచారం ఎప్పటికప్పుడు భద్రతా బలగాలకు చేరుతోంది. రాత్రి వేళ కూడా డ్రోన్ల నిఘా ఉండటంతో మావోయిస్టులు అడుగు కదపలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాలింపు వేగవంతం అయ్యింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలంతా అబూజ్‌మడ్‌లోనే ఉన్నారని భావిస్తున్న బలగాలు. చొచ్చుకెళ్తున్నాయి. దీంతో వారి బారి నుంచి మావోయిస్టులు తమను ఎలా రక్షించుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చొక్కారావు సేఫ్..

ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 16న ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడె చొక్కారావు అలియాస్ దామెదర్ చనిపోయారని వార్తలు వచ్చాయి. కానీ.. తాను క్షేమంగా ఉన్నానని చొక్కారావు తన సన్నిహితులకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన అబూజ్‌మడ్ అడవుల్లోనే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

Whats_app_banner