Ujjaini Mahankali Bonalu : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ దంపతులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించారు. పండితులు, ఆలయ సిబ్బంది కేసీఆర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది ప్రభుత్వం. ప్రతీ ఏటా ఆషాఢమాసంలో ఎంతో వైభవంగా బోనాలు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మహంకాళి అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు.
ఆదివారం తెల్లవారుజామున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండడంతో ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని తెలిపారు. క్యూలైన్లల వేచి ఉన్న భక్తులకు మంచి నీళ్లు, ప్రసాదాలు అందజేస్తున్నామన్నారు. అమ్మవారికి తొలి పూజల అనంతరం ఆదివారం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. తెల్లవారుజాము నుంచే అమ్మ వారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బోనాలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని తెలిపారు. 2014 నుంచి బోనాలు వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని పలు ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలియజేశారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలను అమ్మవారు అన్ని విధాలుగా మంచిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నానన్నారు.