Tirupathi Vande Bharat: తిరుపతికి జర్నీ 8.30గంటలే…వందే భారత్ షెడ్యూల్ ఖరారు-secunderabad tirupati vande bharat express to start from april 8 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Secunderabad Tirupati Vande Bharat Express To Start From April 8

Tirupathi Vande Bharat: తిరుపతికి జర్నీ 8.30గంటలే…వందే భారత్ షెడ్యూల్ ఖరారు

HT Telugu Desk HT Telugu
Mar 31, 2023 06:51 AM IST

Tirupathi Vande Bharat: తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణానికి షెడ్యూల్‌ ఖరారైంది. ఏప్రిల్ 8 నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ తిరుపతి-సికింద్రాబాద్‌ మధ్య పరుగులు తీయనుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు వేగంగా తిరుపతి చేరుకోడానికి కొత్త రైలు ఉపయోగపడనుంది.

వేగంగా దూసుకెళుతున్న వందే భారత్ రైలు
వేగంగా దూసుకెళుతున్న వందే భారత్ రైలు

VandeBharat Express: తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు భారతీయ రైల్వే సిద్ధమైంది. ప్రస్తుతం విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తుండగా రెండో రైలును ఏప్రిల్‌ నెలలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఏప్రిల్‌ 8 నుంచి సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య వందేభారత్‌ రైలు నడపాలని ఇప్పటికే కేంద్ర రైల్వేశాఖ నిర్ణయించింది.

ఏప్రిల్‌ 8 నుంచి ఈ రైలును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు వందే భారత్‌ రైలు ప్రారంభోత్సవంపై సూత్రప్రాయంగా నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అందించారు. ఈ రైలు ప్రయాణించే రూట్, ప్రయాణ సమయం, ఆగాల్సిన రైల్వేస్టేషన్లు, చార్జీలపై నివేదికను సమర్పించారు. కొత్త రైలు సర్వీస్ ప్రారంభోత్సవంపై దక్షిణ మధ్య రైల్వే అధికారుల కసరత్తు కొలిక్కి వచ్చింది.

ప్రస్తుతం హైదరాబాద్‌-తిరుపతి మధ్య నడుస్తున్న నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లోనే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. ఏప్రిల్ 9న తిరుపతిలో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. 10వ తేదీన సికింద్రాబాద్‌లో మొదలవుతుంది. 8వ తేదీ నుంచి సికింద్రాబాద్‌లో లాంఛనంగా రైలును ప్రారంభించినా తొలిరోజు ప్రయాణికులను అనుమతించరు.

రెండు తెలుగురాష్ట్రాల మధ్య మూడు వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ గతంలోనే నిర్ణయించింది. అందులో మొదటగా సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య వందేభారత్‌ రైలును కొద్ది నెలల క్రితం ప్రవేశపెట్టారు. ఆ రైలుకు ప్రయాణికుల నుంచి అత్యంత ఆదరణ లభిస్తోంది. రోజూ వందశాతం ఆక్యుపెన్సీ సాధిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వందేభారత్‌ రైలును సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య నడిపేందుకు రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న రైలులో సీటింగ్ సదుపాయం మాత్రమే అందుబాటులో ఉంది.

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి నడిచే రైలుకూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోచ్‌లతోనే నడువనంది. సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య ప్రయాణ సమయాన్ని 8.30గంటలకు పరిమితం చేశారు. ట్రైన్ నంబర్ 20701గా బయలుదేరు ఈ రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 6గంటలకు బయలుదేరుతుంది. నల్గొండకు 7.19, గుంటూరుకు 9.45కు చేరుతుంది. ఒంగోలుకు ఉదయం 11.09కు, నెల్లూరుకు 12.29కు, తిరుపతికి 14.30కు చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో తిరుపతిలో 20702 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మధ్యాహ్నం 3.15కు బయలుదేరుతుంది. సాయంత్రం 5.20కు నెల్లూరు, ఆరున్నరకు ఒంగోలు, 7.45కు గుంటూరు, 10.10కు నల్గొండ, 11.45కు సికింద్రాబాద్‌ చేరుతుంది. మంగళవారం మినహా వారంలో ప్రతిరోజు రైలును నడిపేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.

IPL_Entry_Point