Vistadome Coach : సికింద్రబాద్-పూణే శతాబ్దిలో “విస్టాడోమ్” కోచ్….
సికింద్రబాద్-పూణేల మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పునరుద్ధరించారు. కోవిడ్ కారణంగా రద్దు చేసిన ఈ రైలు పునరుద్ధరించడంతో పాటు అందులో విస్టాడోమ్ కోచ్‌ను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వారంలో మంగళవారం మినహా ఆరు రోజులు ఈ రైలు రెండు వైపులా ప్రయాణిస్తుంది.
దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్ తో నడిచే మొట్టమొదటి రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్ - పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో విస్టాడోమ్ కోచ్‌ను ప్రవేశపెట్టారు.
ఆగస్టు 10న ప్రవేశపెట్టిన ఈ సర్వీసుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో నిలిపివేసిన 12026/12025 సికింద్రాబాద్ - పూణే - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ రైలును ఆగస్టు 10 నుంచి రెండు వైపులా పునరుద్ధరించారు. దీంతో పాటు రైలులో కొత్తగా చేర్చిన విస్టా డోమ్ కోచ్ కు ప్రయాణీకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోంది దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్ తో నడిచే మొట్టమొదటి రైలు సికింద్రాబాద్ - పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నిలిచింది. విస్టా డోమ్ కోచ్ ప్రవేశపెట్టిన రోజుల వ్యవధిలో రైలులో ప్రయాణీకుల సగటు 63% ఉంది.
లింక్ హఫ్మాన్ బుష్ కోచ్‌లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ రైలుకు విస్టాడోమ్ కోచ్ ను చేర్చడం అదనపు ఆకర్షణగా మారింది. పెద్ద పెద్ద గాజు కిటికీలుండే కోచ్ పై కప్పు కూడా గాజుతో తయారు చేశారు. ఈ కోచ్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు సికింద్రాబాద్ - పూణే - సికింద్రాబాద్ మార్గంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను కొండలను, లోయలను చూస్తూ వెళ్శొచ్చు. పెద్ద పెద్ద గాజు కిటికీలు ప్రయాణీకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
టిక్కట్ ధరలు….
ఈ రైలులో ఒక విస్టా డోమ్ కోచ్ , రెండు ఎగ్జిక్యూటివ్ తరగతి ఏసీ కోచ్ లు మరియు తొమ్మిది ఏసి చైర్ కార్ కోచ్ లు ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి పూణే కు విస్టా డోమ్ కోచ్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ. 2110/- చార్జి చేస్తారు. ఎగ్జిక్యూటివ్ తరగతి కోచ్ లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ.1935/- చార్జి చేస్తారు. క్యాటరింగ్ సౌకర్యం కావాలంటే బుకింగ్ సమయంలోనే ప్రతి ఒక్కరు అదనంగా రూ. 385/- చెల్లించవలసి ఉంటుంది. ఏసి చెయిర్ కార్ లో ప్రయాణానికి రూ.905/- తో మొదలై ప్రయాణ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఛార్పెజీ పెరుగుతుంది. వీటిలో డైనమిక్ ఫేర్ పద్ధతిలో చార్జి వసూలు చేస్తారు. క్యాటరింగ్ సౌకర్యం కావాలంటే బుకింగ్ సమయంలోనే ప్రతి ఒక్కరు అదనంగా రూ. 275/- చెల్లించవలసి ఉంటుంది.