Secunderabad High Tension : సికింద్రాబాద్ లో హైటెన్షన్, నిరసనకారులపై పోలీసుల లాఠీ ఛార్జ్-ఇంటర్నెట్ బంద్!-secunderabad high tension in hindu activists protest police lathi charge internet bandh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Secunderabad High Tension : సికింద్రాబాద్ లో హైటెన్షన్, నిరసనకారులపై పోలీసుల లాఠీ ఛార్జ్-ఇంటర్నెట్ బంద్!

Secunderabad High Tension : సికింద్రాబాద్ లో హైటెన్షన్, నిరసనకారులపై పోలీసుల లాఠీ ఛార్జ్-ఇంటర్నెట్ బంద్!

Bandaru Satyaprasad HT Telugu
Oct 19, 2024 03:19 PM IST

Secunderabad High Tension : సికింద్రాబాద్ లో ఘర్షణ వాతావరణ నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి. హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీలో ఉద్రిత్త నెలకొంది. దీంతో పోలీసుల లాఠీఛార్జ్ చేశారు.

సికింద్రాబాద్ లో హైటెన్షన్, నిరసనకారులపై పోలీసుల లాఠీ ఛార్జ్-ఇంటర్నెట్ బంద్!
సికింద్రాబాద్ లో హైటెన్షన్, నిరసనకారులపై పోలీసుల లాఠీ ఛార్జ్-ఇంటర్నెట్ బంద్!

సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వీహెచ్పీ, హిందూ సంఘాల కార్యకర్తల ర్యాలీలో ఘర్షణ తలెత్తింది. ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసంపై హిందూ సంఘాలు నిరసనకు పిలుపునిచ్చారు. హిందూ సంఘాలు చేపట్టిన ర్యాలీలో నిరసనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ర్యాలీని అడ్డుకున్న పోలీసులపైకి నిరసనకారులు కుర్చీలు, చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. నిరసనకారులను పోలీసుల చితకబాదారు. మరోవైపు సికింద్రాబాద్ లో మతఘర్షణలు చెలరేగకుండా పోలీసులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ లో శనివారం స్థానికులు బంద్ కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. హిందూ సంఘాలు, స్థానికులు మహంకాళి ఆలయం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమై, ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ముత్యాలమ్మ ఆలయంపై దాడి

కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఇటీవల ఓ ఆగంతకుడు ధ్వంసం చేశాడు. ఆలయం గద్దెపైకి ఎక్కి అమ్మవారి విగ్రహాన్ని కాళ్లతో తన్నుతూ ధ్వంసం చేశాడు. ఈ ఘటన గమనించిన స్థానికులు...నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. విగ్రహ ధ్వంసం ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నిందితుడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇంటర్నెట్ బంద్!

ముత్యాలమ్మ ఆలయంపై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు శనివారం నిరసన చేపట్టాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ర్యాలీ చేపట్టాయి. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులు పోలీసులపై చెప్పులు, కుర్చీలు విసిరారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు నిరసనకారులపై లాఠీ ఛార్జ్‌ చేశారు. సికింద్రాబాద్ లో తీవ్ర ఉద్రిక్తతల నెలకొనడంతో పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసినట్లు సమాచారం.

"సికింద్రాబాద్‌లో ముత్యాలమ్మ ఆలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హిందూ సోదరులపై అన్యాయంగా లాఠీఛార్జ్ చేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మతపరమైన మనోభావాలపై దాడి జరిగినప్పుడు, విగ్రహాలను అపవిత్రం చేసినప్పుడు శాంతియుతంగా నిరసన చేయడానికి కూడా అనుమతించకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ లాఠీ ఛార్జీకి ఎవరు ఆదేశించారు? ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్పా న్యాయం కోరే భక్తులపై కాదు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు ఇది స్పష్టమైన ఉదాహరణ, మెజారిటీ ఆందోళనలను ఎప్పుడూ పట్టించుకోలేదు. మా విశ్వాసంపై జరిగిన ఈ దాడికి మేము జవాబుదారీతనం, న్యాయాన్ని కోరుతున్నాము" - రాజాసింగ్, బీజేపీ ఎమ్మెల్యే

Whats_app_banner

సంబంధిత కథనం