SCR QR Code Facility : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై అన్ని స్టేషన్లలో QR కోడ్‌తో పేమెంట్స్‌-scr provides qr code facility enabled at ticketing counters at all stations for purchase of tickets at counters ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Qr Code Facility : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై అన్ని స్టేషన్లలో Qr కోడ్‌తో పేమెంట్స్‌

SCR QR Code Facility : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై అన్ని స్టేషన్లలో QR కోడ్‌తో పేమెంట్స్‌

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 15, 2024 02:04 PM IST

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ కొనుగోలులో చిల్లర కష్టాలకు చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్లను విక్రయించనుంది. ఇప్పటివరకు ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఈ వ్యవస్థ ఉండగా… ఇకపై అన్ని స్టేషన్లలో కొత్త సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది.

క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ల విక్రయం
క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ల విక్రయం (Image Source @SCRailwayIndia Twitter (X))

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. క్యూ ఆర్ కోడ్ ద్వారా టిక్కెట్లను విక్రయించే అవకాశాన్ని ప్రవేశపెట్టింది. ఈ సేవల ద్వారా చిల్లర కష్టాలకు పూర్తిస్థాయిలో చెక్ పడనుంది.

అన్ని స్టేషన్లకు విస్తరణ…!

ఇంతకుముందే క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు చేసే విధానాన్ని ప్రయోగత్మకంగా పలు స్టేషన్లలోని కౌంటర్లలో ప్రవేశపెట్టింది. దీంతో ఆశించిన ఫలితాలు రావటంతో…. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. జోన్ పరిధిలో ఉన్న అన్ని స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీంతో రైల్వే టికెట్‌ కౌంటర్ల దగ్గర టికెట్ల కొనుగోలు మరింత సులభతరం కానుంది.

తాజా నిర్ణయంతో రైల్వే స్టేషన్లలోని జనరల్‌ బుకింగ్‌, రిజర్వేషన్‌ కౌంటర్లలో QR (Quick Response) కోడ్‌ను ఉపయోగించి ఇకపై డిజిటల్‌ చెల్లింపులు చేసేయవచ్చు. అన్ని స్టేషన్లలోని టికెట్ విండో వద్ద ప్రత్యేక డివైజ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. యూపీఐ యాప్స్‌ వినియోగించి సింపుల్ గా డబ్బులను చెల్లించి టికెట్లను పొందవచ్చు. పేమెంట్ పూర్తి కాగానే టికెట్ అందజేస్తారు.

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ సేవలను ప్రారంభించింది రైల్వే శాఖ. జనరల్ ​బుకింగ్​కౌంటర్లలో ఉన్న క్యూఆర్​ కోడ్​ను స్కాన్ చేసి నిమిషాల్లో వ్యవధిలోనే ట్రైన్ టికెట్ పొందవచ్చు.

ఈ విధానం ద్వారా ప్రధానంగా చిల్లర సమస్యలకు చెక్ పడినట్లు అయింది. తొలి దశలో భాగంగా…సికింద్రాబాద్, హైదరాబాద్, కాజీపేట , వరంగల్ , బేగంపేట మంచిర్యాల, లింగంపల్లి, హైటెక్ సిటీ, జేమ్స్ స్ట్రీట్, మహబూబాబాద్, బెల్లంపల్లి, ఫతేనగర్ బ్రిడ్జ్, సిర్పూర్ కాగజ్ నగర్, వికారాబాద్ రైల్వే స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ విజయవంతం కావటంతో జోన్ పరిధిలోని అన్ని స్టేషన్లకు విస్తరింపజేశారు. ఇప్పటికే అన్ని స్టేషన్లకు డివైజులను పంపారు. మరికొన్ని రోజుల్లో అన్ని స్టేషన్లలో ఈ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

ప్రత్యేక రైళ్లు పొడిగింపు:

మరోవైపు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా పలు ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూట్ల వివరాలు, తేదీలను పేర్కొంది.

సికింద్రాబాద్‌ నుంచి పట్నా మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును పొడిగించినట్లు దక్షిమ మధ్య రైల్వే ప్రకటన చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో ఈ ప్రత్యేక రైలు సేవలు అందిస్తుందని పేర్కొంది. హైదరాబాద్ - పట్నా మధ్య నడిచే ప్రత్యేక రైలు సర్వీస్ ను కూడా పొడిగించింది. అక్టోబర్‌ 2 వరకు ప్రతి బుధవారం నడుస్తుందని పేర్కొంది.

ఇక సికింద్రాబాద్ - పాట్నా మధ్య నడిచే రైలును కూడా పొడిగించారు.ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు ఈ ట్రైన్ సేవలు అందిస్తుంది. ప్రతి శుక్రవారం రాకపోకలు ఉంటాయి.

దానాపూర్‌-సికింద్రాబాద్‌ (03225) రైలు సెప్టెంబర్‌ 26 వరకు ప్రతి గురువారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇక సికింద్రాబాద్‌ – దానాపూర్‌ (ట్రైన్ నెంబర్ 3226) రైలు సెప్టెంబర్‌ 29 వరకు ప్రతి ఆదివారం సేవలందిస్తుందని పేర్కొంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రైళ్లను పొడిగించినట్లు తెలిపింది. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలి కోరింది.