CCTV Footage: పాపం చిన్నారి.. రెప్పపాటులో ప్రమాదం.. తేరుకునే లోపే..-scenes of road accident in hyderabad habsiguda recorded in cctv camera ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cctv Footage: పాపం చిన్నారి.. రెప్పపాటులో ప్రమాదం.. తేరుకునే లోపే..

CCTV Footage: పాపం చిన్నారి.. రెప్పపాటులో ప్రమాదం.. తేరుకునే లోపే..

Basani Shiva Kumar HT Telugu
Aug 30, 2024 02:44 PM IST

CCTV Footage: అసలే వర్షాకాలం. ఆపై వాహనాల రద్దీ. ఇలాంటి సమయంలో చిన్న పొరపాటు కూడా ప్రాణాల మీదకు వస్తుంది. తాజాగా హైదరాబాద్‌లోని హబ్సిగూడలో అదే జరిగింది. రెప్పపాటులో ఓ లారీ చిన్నారిని చిదినేసింది. ప్రమాదం నుంచి తేరుకునే లోపే పాప చనిపోయింది.

హబ్సిగూడ ప్రమాదంలో బాలిక మృతి
హబ్సిగూడ ప్రమాదంలో బాలిక మృతి (Image source: twitter )

మామూలుగానే హైదరాబాద్‌లోని రోడ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. ఇక వర్షం పడినప్పుడు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు వర్షం.. మరోవైపు వాహనాల రద్దీ. ఇలాంటి సమయంలో స్కూళ్లు విడిచిపెట్టారు. దీంతో వారి పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చింది ఆ తల్లి. ఎంతో జాగ్రత్తగా రోడ్డుపై వెళ్తుంది. కానీ.. ఓ లారి యమదూతలా దూసుకొచ్చింది. చిన్నారిని చిదిమేసింది.

సీసీటీవి కెమెరాల్లో రికార్డ్..

హైదరాబాద్ నగరం హబ్సిగూడలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ప్రమాదానికి సంబంధించి స్కూటీని లారీ ఢీకొట్టిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. కామేశ్వరి (10), ఆమె తమ్ముడు వేదాంష్ స్థానిక జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో చదువుతున్నారు. రోజులాగే గురువారం కూడా స్కూలుకు వెళ్లారు. సాయంత్రం వారిని ఇంటికి తీసుకెళ్లడానికి తల్లి సంతోషి స్కూటీ వేసుకొని వచ్చారు.

టైర్ల కింద పడిపోయిన బాలిక..

స్కూటీపై పిల్లలను తీసుకొని వెళ్తుండగా.. ఉప్పల్ నుంచి వేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. సంతోషి, వేదాంష్ లారీకి ఎడమ వైపు పడిపోయారు. కామేశ్వరి కుడివైపు పడిపోగా.. లారీ వెనక టైర్లు బాలిక పైనుంచి వెళ్లాయి. దీంతో కామేశ్వరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. లాభం లేకుండా పోయింది. బాలిక కామేశ్వరి చనిపోయింది.

జాగ్రత్తలు తప్పనిసరి..

వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలోకి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లారీలను అనుమతించకుంటే బాగుంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. చాలాచోట్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ట్రాఫిక్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇదే సమయంలో.. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రిపుల్ డ్రైవింగ్‌కు నో చెప్పాలి. రైడర్, వెనకాల కూర్చున్న వారు ఇద్దరూ హెల్మెట్ ధరించాలి. లేన్ డ్రైవింగ్‌ను పాటించాలి. ముఖ్యంగా వర్షం కురుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.