Seeds Scarcity: అన్నదాతలను వేధిస్తున్న విత్తనాల కొరత,జగిత్యాలలో క్యూలైన్లలో రైతుల పడిగాపులు-scarcity of seeds harassing the farmers farmers waiting in q lines ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Seeds Scarcity: అన్నదాతలను వేధిస్తున్న విత్తనాల కొరత,జగిత్యాలలో క్యూలైన్లలో రైతుల పడిగాపులు

Seeds Scarcity: అన్నదాతలను వేధిస్తున్న విత్తనాల కొరత,జగిత్యాలలో క్యూలైన్లలో రైతుల పడిగాపులు

Sarath chandra.B HT Telugu
May 30, 2024 09:59 AM IST

Seeds Scarcity:

జగిత్యాలలో విత్తనాల కోసం బారులు తీరిన రైతులు
జగిత్యాలలో విత్తనాల కోసం బారులు తీరిన రైతులు

Seeds Scarcity: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పచ్చిరొట్ట విత్తనాల కొరత ఏర్పడింది. రైతులకు కావాల్సినన్ని పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో విత్తనాలు విక్రయించే కేంద్రాల వద్ద బారులు తీరి అన్నధాతలు ఆందోళన చెందుతున్నారు.

జీలుగు, పిల్లిపెసర, జనుము విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. వేకువజామున్నే విత్తనాలు సప్లై చేసే సహకార సంఘాల వద్దకు చేరుకుని బారులు తీరుతున్నారు. పలు చోట్ల క్యూ లైన్ లో రైతులు నిలబడలేక పట్టేదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు క్యూలైన్ లో పెట్టి తమ వంతు ఎప్పుడు వస్తుందోనని దీనంగా ఎదురుచూస్తున్నారు.

జగిత్యాల, మల్యాల, నూకపల్లిలో పచ్చిరొట్ట విత్తనాల కోసం రైతులు సహకార సంఘం కార్యాలయం, అగ్రోస్ కేంద్రాల వద్దకు భారీగా రైతులు చేరుకుని పాస్ బుక్ లు, ఆదార్ కార్డులు క్యూలో పెట్టి విత్తనాల కోరత నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు. అవసరానికి సరిపడా పచ్చిరొట్ట విత్తనాలు లేకపోవడంతో అధికారులు, ఒక్కో రైతుకు 30 కేజిల బ్యాగ్ ఒక్కటి మాత్రమే ఇస్తున్నారు.

ఆ ఒక్క బ్యాగ్ కేవలం రెండున్నర ఎకరాలకు మాత్రమే సరిపోతుంది. ఐదారు ఎకరాలు ఉన్న రైతులకు ఒక్క బ్యాగ్ ఇస్తే ఏలా అని అన్నధాతలు ఆవేధనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. కావాల్సినన్ని విత్తనాలు తెప్పిస్తామని అధికారులు అంటున్నారు.

పత్తి విత్తనాలకు కృత్రిమ కొరత

పచ్చరొట్ట విత్తనాలతో పాటు పత్తి విత్తనాల కొరత కూడా ఉంది. మార్కెట్ లో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ రేటుకు విక్రయిస్తు రైతుల సొమ్మును అడ్డదారిలో దోచుకుంటున్నారు. సాధారణ ధరలకు పత్తి విత్తనాలు లభించే పరిస్థితే కనిపించడం లేదు.

ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి సాగు చేయాలని ఆశిస్తున్న రైతులు విత్తనాల కోసం దుకాణాలకు వెళ్తే తాము కోరుకున్న కంపెనీలవి కావాలంటే ఎమ్మార్పీకన్నా అధిక ధర పెట్టాల్సివస్తోంది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల నాలుగు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

పత్తి సాగు చేయాలనుకునే రైతులు సాదారణంగా గతంలో వారు సాగు చేసి మంచి దిగుబడి వచ్చిన కంపెనీల విత్తనాల పైనే ఆసక్తి చూపిస్తారు. రైతుల ఈ నమ్మకాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. రూ.860కి లభించే విత్తనాల ప్యాకెట్ కు దుకాణదారులు రూ.1600కు అమ్ముతున్నారు. కొ

న్ని చోట్ల ఈ ధర కొన్ని కంపెనీలవి రూ.2 వేల వరకు పలుకుతోంది. రైతులు ఎక్కువ కోరే కంపెనీల విత్తనాలు తమ వద్ద లేవని నో స్టాక్ బోర్డు పెడుతున్న వ్యాపారులు అవే రకం కావాలని రైతులు బతిమిలాడితే సరఫరా లేవని చెబుతున్నారు. వారి కోసమైతే ఎక్కువ ధరకు తెప్పించగలమని నమ్మించి రెట్టింపు కన్నా అధిక ధర వసూలు చేస్తున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులకు నష్టం చేస్తున్నారు.

రైతులు కూడా తమకు తెలిసినా, తాము గతంలో సాగు చేసిన కంపెనీల విత్తనాలే అడుగుతున్నారు. ఇతర కంపెనీలవి కొనేందుకు మొగ్గు చూపడం లేదు. ప్రయోగాలు చేయడం ఇష్టం లేక వారు కొన్ని కంపెనీల విత్తనాలపై ఆసక్తి చూపిస్తుండటాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

ఆలస్యం చేస్తే ఇవికూడా లభించవని వ్యాపారులు చెబుతుండటంతో అన్నదాతలు రెట్టింపు కన్నా ఎక్కువైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని విత్తనాల సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.

ఏటా తగ్గుతున్న పత్తిసాగు...

పత్తి సాగు ఉమ్మడి జిల్లాలో ఏ ఏటికాయేడు తగ్గుతోంది. 2021లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 195033 ఎకరాల్లో పత్తి సాగు చేస్తే 2022లో 202305 ఎకరాల్లో, గత ఏడాది 2023లో 172844 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సాగు విషయంలో అనుకున్న దిగుబడి రాకపోవడం, చీడపీడల ఇక్కట్లు, అకాల వర్షంతో నష్టం, చివర్లో కూలీల కొరత కారణంగా ఆ పంటను సాగు చేయడానికి అన్నదాతలు జంకుతున్నారు.

నీళ్లు తక్కువగా అందుబాటులో ఉన్న పొలాల్లోనే అన్నదాతలు దీన్ని సాగు చేస్తున్నారు. దీంతోపాటు గతేడాది క్వింటా పత్తి రూ.14 వేలకు పైగా పలకడం.. 2022లో రూ.18 వేల వరకు వెళ్లడంతో కొంతమంది రైతులు ఆ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. మేలైన రకాలను విత్తితేనే నాణ్యమైన గింజ రూపంలో దిగుబడి వస్తుంది. దీంతో అన్నదాతలు కొన్ని కంపెనీల విత్తనాల సాగుకే అలవాటు పడ్డారు. స్థానికంగా అందుబాటులో లేకున్నా సరిహద్దు జిల్లాలకు వెళ్లి అవసరమైన వాటిని ఎంత ధరైనా వెచ్చించి తెచ్చుకుంటున్నారు.

నకిలీ విత్తనాల పట్టివేత..ఇద్దరు అరెస్టు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల అమ్మకాలతోపాటు రైతులను అధిక ధరలతో మోసం చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని నాలుగు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి, రామగుండం సీపీ శ్రీనివాసులు, జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్, సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ ఇదివరకే ప్రకటనలు విడుదల చేసి వ్యాపారులకు, రైతులకు సూచనలు చేశారు.

నల్లబజారులో విత్తనాలు అమ్మినా... లేదా నకిలీ విత్తనాలను విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇదే సమయంలో వ్యవసాయశాఖ జిల్లా అధికారులు ఆయా మండలాల్లో స్పెషల్ టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రామగుండం కమీషనరేట్ పరిధిలో బారీ మొత్తంలో నిషేధిత నకిలీ బిటి-3 పత్తి విత్తనాలు 16 లక్షల 50 వేల రూపాయల విలువచేసే 5.5 క్వింటాళ్ళు పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.

పోలీసుల కళ్ళు గప్పి కర్నాటక నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా మహారాష్ట్రకు తరలిస్తుండగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. అక్రమార్కులు దొడ్డిదారిన నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రైతులు అప్రమతంగా ఉంటే నకిలీ విత్తనాల బారిన పడే అవకాశం ఉండదని అదికారులు అంటున్నారు. ప్రభుత్వం ఆమోదించిన ఫర్టిలైజర్ షాపుల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన విత్తనాల బ్యాగులను, రసీదులను పంటచేతుకొచ్చేంత వరకు భద్రపరచుకోవాలని రైతులకు వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్ కేవీ.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

టీ20 వరల్డ్ కప్ 2024