తెలంగాణ ఆర్టీసీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా సరిత..! ఆమె నేపథ్యం ఇదే-saritha appointed as telangana rtc first woman driver ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ ఆర్టీసీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా సరిత..! ఆమె నేపథ్యం ఇదే

తెలంగాణ ఆర్టీసీలో సరికొత్త చరిత్ర - తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా సరిత..! ఆమె నేపథ్యం ఇదే

తెలంగాణ ఆర్టీసీలో తొలిసారిగా మహిళా డ్రైవర్ వచ్చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలం సీత్య తండాకు చెందిన సరిత విధుల్లోకి చేరారు. తొలి రోజు హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు బస్‌ నడిపారు. ఆమెకు పలువురు మంత్రులతో పాటు ఆర్టీసీ అధికారులు అభినందనలు తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో తొలిసారిగా మహిళా డ్రైవర్ ను నియమించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండల పరిధిలోని సీత్య తండాకు చెందిన సరిత విధుల్లో చేరారు. శనివారం హైదరాబాద్‌ నుంచి మిర్యాలగూడకు బస్సును నడిపారు. సరిత నియామకంపై రాష్ట్ర ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.

మహిళా డ్రైవర్ గా సరిత - ముఖ్యమైన విషయాలు:

  • తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ గా సరిత నియమితులయ్యారు.
  • సరితది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని సీత్య తండా.
  • రాంకోటి, రుక్కా దంపతుల ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి సరిత. దేవరకొండలో 8వ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఓపెన్ టెన్త్ లో పాసయ్యారు.
  • తొలుత ఆటో నడపటాన్ని సరిత నేర్చుకున్నారు. దాదాపు ఐదేండ్ల పాటు సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలో ఆటోను నడిపారు. ఆ తర్వాత హైదరాబాద్ కు కారు డ్రైవింగ్, బస్సు డ్రైవింగ్ నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నారు.
  • ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌లో మహిళా డ్రైవర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ రావటంతో దరఖాస్తు చేసుకున్న సరిత… ఉద్యోగానికి ఎంపికయ్యారు. గత 10 సంవత్సరాలుగా విధులు నిర్వహించారు.
  • ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2018లో నాటి రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకున్నారు.
  • సరిత ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించగా… కుటుంబ పరిస్థితుల కారణంగా స్వరాష్ట్రానికి రావాలని నిర్ణయించుకున్నారు. తన స్వస్థలంలో డ్రైవర్ గా అవకాశం ఇవ్వాలని ఇటీవల సరిత పలువురు మంత్రులతో పాటు టీజీఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
  • సరిత విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం… ఆమెకు ఉద్యోగం ఖరారు చేశారు.
  • మిర్యాలగూడ డిపో లో జేబీఎం సంస్థ నుంచి తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మహిళా డ్రైవర్ గా జూన్ 14వ తేదీన విధుల్లో చేరారు. హైదరాబాద్ - మిర్యాలగూడ మధ్య బస్సును నడుపుతున్నారు.
  • సరితకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. అవకాశాలు వస్తే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని సరిత నిరూపించారని ప్రశంసించారు.
  • సరిత నియామకం పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు.మహిళా సాధికారత దిశగా తెలంగాణ ఆర్టీసీ అడుగులు వేస్తోందని చెప్పారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.