స్వరాష్ట్రంలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు...! ముస్తాబవుతున్న కాళేశ్వర క్షేత్రం-saraswati river pushkaralu 2025 to be held from may 15 at kaleshwaram temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  స్వరాష్ట్రంలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు...! ముస్తాబవుతున్న కాళేశ్వర క్షేత్రం

స్వరాష్ట్రంలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు...! ముస్తాబవుతున్న కాళేశ్వర క్షేత్రం

HT Telugu Desk HT Telugu

స్వరాష్ట్రంలో తొలిసారి సరస్వతీ పుష్కరాలు జరగనున్నాయి. మే 15 నుంచి నిర్వహణకు కాళేశ్వర క్షేత్రం ముస్తాబవుతోంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఏర్పాట్ల కోసం రూ.35 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయగా… ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది.

సరస్వతీ పుష్కరాలు

దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వర పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు రెడీ అవుతోంది. ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో చివరగా రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ పుష్కరాలు జరగగా.. ఈసారి మే 15 నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కొద్దిరోజుల కిందట ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగిన కుంభమేళాకు దేశవ్యాప్తంగా కోట్ల మంది తరలిరాగా.. సరస్వతీ పుష్కరాలకు కూడా భారీ స్థాయిలో భక్తులు వస్తారని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు స్వరాష్ట్రంలో తొలిసారి నిర్వహించే సరస్వతీ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనులు చేపట్టింది. వివిధ పనుల కోసం రూ.25 కోట్లు మంజూరు చేయగా, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తోంది.

చివరిసారి 2013లో..

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పుష్కరాలు జరుగుతుండగా, చివరగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013 సంవత్సరంలో నిర్వహించారు. ఆ సమయంలో దాదాపు 20 లక్షల మంది వరకు భక్తులు పుష్కర స్నానాలు ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తరువాత 12 ఏళ్లకు మళ్లీ ఇప్పుడు సరస్వతీ పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు.

మే 15 నుంచి 26 వరకు

పుష్కరాలు అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర నదుల ఒడ్డున జరిగే ఓ మహా పండుగ. జ్యోతిష్య శాస్త్రాల అనుగుణంగా నవగ్రహాల గమనంలో బృహస్పతి మిథున రాశీలోకి ప్రవేశించిన సంవత్సరంలో సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. దాని ప్రకారం ఈ ఏడాది మే 15వ తేదీ నుంచి 12 రోజుల పాటు ఈ సరస్వతీ పుష్కరాల మహా క్రతువును నిర్వహించనున్నారు. ఇప్పటికే మే 15న సూర్యోదయం నుంచి మే 26 వరకు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు.

తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల నుంచి దాదాపు 35 లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు పుష్కరాలకు వచ్చే రద్దీకి తగ్గట్లుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సరస్వతీ పుష్కరాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్, భద్రత అంశాలపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

రూ.25 కోట్లతో పనులు

కాళేశ్వరంలోని సరస్వతీ పుష్కరాల నిర్వహణకు మొదట రూ.35 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయగా, ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో ప్రధానంగా కాళేశ్వరంలో 17 అడుగుల ఏకశిలా సరస్వతీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహంతో పాటు వేదమూర్తుల విగ్రహాలు నెలకొల్పనున్నారు.

ఈ పుష్కరాల్లో ఈ విగ్రహాలే ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. వాటితో పాటు కాళేశ్వరంలో వివిధ చోట్లా సీసీ పనులతో పాటు క్యూలైన్లు, క్యూ లైన్ చుట్టూ మెష్ జాలి ఏర్పాటు, గోదావరి ఘాట్ వద్ద ఆర్చ్ గేట్ నిర్మాణం, కళ్యాణ కట్ట, పిండ ప్రధానం హాల్ నిర్మాణం, ప్రసాదం కౌంటర్ల నిర్మాణం, ప్రసాదం తయారీ హాల్ వీఐపీ ఘాట్ వద్ద ర్యాంప్ నిర్మాణం పనులు చేపడుతున్నారు.

శాశ్వత మరుగు దొడ్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, మంచినీటి ట్యాంక్ పనులు, పుష్కర ఘాట్లలో స్నానఘట్టాలు, బట్టలు మార్చుకునే గదులు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులన్నీ మే 4 లోపు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.

ఏర్పాట్లు ముమ్మరం

కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో నిర్వహించే సరస్వతీ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేవాదాయ శాఖతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న పుష్కరాలు కావడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. కాగా ఇంకో 25 రోజుల్లోనే సరస్వతీ పుష్కరాలు జరగనుండగా.. ఆలోగా పనులు పూర్తవుతాయో లేదోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం