భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు నేటి నుంచి హారతి కార్యక్రమాన్ని లైవ్ కవరేజీ చేశారు.
ప్రతీ రోజు సాయంత్రం నిర్వహించే సరస్వతి హారతిని ఇవ్వడానికి, కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే పండితులను ప్రత్యేకంగా ప్రభుత్వం పిలిపించింది. దాదాపు అరగంట పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది ప్రత్యేక హారతులను ఇస్తారు.
సరస్వతి నవరత్న మాలా హారతి మహోత్సవం 6వ రోజు అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సరస్వతి అమ్మవారి హారతిని వీక్షించి దివ్యదర్శనం పొందారు.
సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రజల శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక హారతి, ధార్మిక ఉత్సవాలు సమాజంలో సానుకూల చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు.
నేటితో సరస్వతి పుష్కరాలు ప్రారభమై ఆరు రోజులు అయ్యిందని, ప్రతి రోజు లక్షలాది మంది పుష్కర స్నానాలు ఆచరించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.
గత 6 రోజులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలు పుష్కరాల ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు సౌకర్యాలు కల్పనపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారని ఏర్పాట్లు పట్ల హర్షం వ్యక్తం చేశారు. రానున్న 6 రోజులు చాలా ముఖ్యమని భక్తులు రద్దీ పెరిగే అవకాశం ఉందని ఎలాంటి లోటుపాట్లు రానీయొద్దని సూచించారు.
సంబంధిత కథనం