మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు 2025 - ముఖ్యమైన 10 విషయాలు-saraswati pushkaralu 2025 will be held from may 15 to may 26 in kaleshwaram river ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు 2025 - ముఖ్యమైన 10 విషయాలు

మే 15 నుంచి సరస్వతి నది పుష్కరాలు 2025 - ముఖ్యమైన 10 విషయాలు

తెలంగాణలో సరస్వతీ పుష్కరాలకు వేళైంది. మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు యాప్ ను కూడా అందుబాటులోకి తీసకువచ్చింది. మరోవైపు భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

సరస్వతి నది పుష్కరాలు 2025

తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తేదీలను ప్రకటించటంతో పాటు ఏర్పాట్లు చేసే పనిలో పడింది. ఈ మేరకు మంగళవారం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక వెబ్ సైట్ తో పాటు మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించింది.

సరస్వతీ నది పుష్కరాలు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరగనున్నాయి. ఇందుకోసం పుష్కర ఘాట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగానే పుష్కరాల పూర్తి సమాచారంతో కూడిన వెబ్‌ పోర్టల్, యాప్‌ను తీసుకువచ్చారు.

సరస్వతీ పుష్కరాలు - ముఖ్యమైన అంశాలు:

  1. దేశంలో ప్రాశస్త్యం ఉన్న 12 నదులకు పుష్కరాలు జరగడం సంప్రదాయంగా వస్తుండగా ఏటా ఒక నదికి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ 12 నదుల్లో సరస్వతి నది కూడా ఉండటంతో 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతాయి.
  2. ప్రాణహిత, గోదావరి నదుల సంగమం అయిన కాళేశ్వరంలో అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తుంది. ఈ ప్రాంతాన్ని పవిత్రమైన సంగమంగా భావిస్తారు.
  3. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరగనున్నాయి.
  4. కాళేశ్వరం మీదుగా ప్రవహిస్తున్న గోదావరినదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. రెండు నదులు సంగమించిన చోట సరస్వతి అంతర్వాహిని నది ఉద్బవిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.
  5. మే 15వ తేదీన శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠానికి చెందిన మాధవానంద సరస్వతిస్వామి పుష్కరాలను ప్రారంభిస్తారు.
  6. మే 17వ తేదీన తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18వ తేదీన పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి పుష్కర స్నానం చేస్తారు.
  7. మే 19వ తేదీన నాసిక్‌ త్రయంబకేశ్వర్‌లోని మహామండలేశ్వర్‌ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పుష్కరస్నానం ఆచరిస్తారు.
  8. సరస్వతి పుష్కరాల్లో కాశీ నుంచి వచ్చే పురోహితులు ప్రత్యేక హారతి, హోమాలు చేస్తారు. ఇలా చేయటం తొలిసారి అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
  9. పుష్కరాల పూర్తి సమాచారంతో కూడిన వెబ్‌ పోర్టల్, యాప్‌ను దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు.
  10. భక్తుల సౌకర్యార్థం కోసం అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. గదుల వసతితో పాట డార్మిటరీ భవనాలను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్‌ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం