సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు-saraswati pushkaralu 2025 telangana cm revanth reddy ministers take holy dip ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు గురువారం సాయంత్రం పుష్కర స్నానం ఆచరించారు. అనంతరం సీఎం సరస్వతి నదికి హారతి ఇచ్చారు.

సరస్వతీ పుష్కరాలు- పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరం సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ... గురువారం సాయంత్రం సరస్వతీనదిలో పుష్కర స్నానం ఆచరించారు.

మే 26 వరకు పుష్కరాలు

అనంతరం సరస్వతీ నదికి హారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది కలిసే కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు పుష్కరాలు జరగనున్నాయి.

ప్రతీ రోజు నదీ హారతి

ప్రతిరోజూ సరస్వతీ ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీంతో పాటు కళా, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

భక్తుల సౌకర్యార్థం టెంట్‌ సిటీని నిర్మించారు. సరస్వతీ పుష్కరాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. ప్రతిరోజు లక్షన్నర మంది పుష్కరస్నానం చేస్తారని దేవాదాయశాఖ అంచనా వేస్తుంది.

నా అదృష్టంగా భావిస్తున్నా- సీఎం రేవంత్ రెడ్డి

"మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం.

నా హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నదులు మన నాగరికత మాత్రమే కాదు.. నదిని మనం దేవుడిగా భావిస్తాం. రాబోయే రోజుల్లో గోదావరి, కృష్ణా పుష్కరాలను నిర్వహించుకుందాం"-సీఎం రేవంత్ రెడ్డి

మంథనికి ఓ ప్రత్యేకత

"మంథని నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన దేశ ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలోనే నాలుగో స్థానానికి తీసుకెళ్లడంలో పీవీ ఎనలేని కృషి చేశారు. ఆ తరువాత ఆ స్థాయిలో దుద్దిళ్ల శ్రీపాదరావు మంథని పేరు నిలబెట్టారు.

ఇప్పుడు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి మంథని ప్రతిష్టను మరింత పెంచారు. బలిష్టమైన ఆర్థిక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు మరింత పనిచేసేందుకు ఆయనకు మంథని ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి.

రాబోయే గోదావరి పుష్కరాలకు అవసరమైతే 200 కోట్లు కేటాయించి ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. ఇందుకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ అభివృద్ధి కోసం పనిచేసే శ్రీధర్ బాబు లాంటి నాయకుడు ఉండటం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం" -సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఏర్పాటైన తొలిసారి

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగుతున్న సరస్వతీ పుష్కరాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారు జామున 5.44కు మొదట పుణ్యస్నానాలతో సరస్వతీ పుష్కరాలను ప్రారంభించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలంగాణ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్‌ దంపతులు కాళేశ్వరంలో పూజలు నిర్వహించారు.

15వ తేదీ గురువారం ఉదయం నుంచి ఈ నెల 26వ తేదీ సోమవారం వరకు పుష్కరాలు కొనసాగుతాయి. 12 ఏళ్లకు ఓసారి జరిగే పుష్కరాలకు లక్షలాది భక్తులు తరలి రానున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

రూ.35కోట్లతో ఏర్పాట్లు

సరస్వతీ నదీ పుష్కరాలకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. దీంతోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు పుష్కరాల కోసం రూ.35 కోట్ల కేటాయించింది. దాదాపు రూ.21.5 కోట్లతో 65 పనులను వివిధ కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అప్పగించగా, తాజాగా మరో రూ.8 కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా కొత్తగా సబ్ స్టేషన్ కూడా నిర్మించారు. దాని ద్వారా పుష్కరాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అందిస్తామని అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నాలుగు జనరేటర్లను అందుబాటులో ఉంచారు. కాళేశ్వరానికి వచ్చే బస్సుల కోసం తాత్కాలిక బస్ స్టేషన్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం