Sangareddy Crime : సంగారెడ్డిలో తీవ్ర విషాదం- ఆర్థిక కష్టాలతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తల్లి ఆత్మహత్య
Sangareddy Crime : అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి, ఆత్మహత్య చేసుకుంది ఓ తల్లి. మద్యానికి బానిసైన భర్తకు రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం, ఆసుపత్రి ఖర్చులు, పిల్లలకు తింటి పెట్టలేని పరిస్థితి. ఈ కష్టాలతో తీవ్ర మనోదనకు గురై దారుణానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డిలో జరిగింది.
Sangareddy Crime : సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త తాగుడుకు బానిస కావడంతో అతని రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. దీంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆసుపత్రి ఖర్చులు భరించలేక, కనీసం పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితి ఆమెది. ఈ కష్టాల సుడిగుండంలో చిక్కుకొని, బయటపడలేక మనస్థాపంతో ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. తల్లీపిల్లలు ఒకేసారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో
రుద్రారం గ్రామానికి చెందిన సావిత్రి (28) ఆంజనేయులు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు జస్వంత్ (5), ఇద్దరు కూతుర్లు చిన్మయి, చిత్ర (3). వీరు ఇద్దరు కవల పిల్లలు. ఆంజనేయులు ఇస్నాపూర్ లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆంజనేయులు తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. సావిత్రి పని చేసుకుంటూ పిల్లలను పోషించేది. తాగుడుకు బానిసైన ఆంజనేయులుకు రెండు కిడ్నీలు పాడైపోయినాయి. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త చికిత్సకు అయ్యే ఖర్చులు భరించలేక, పిల్లలను పోషించలేక ఇబ్బంది పడేది. ఈ క్రమంలో ఐదు సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలను పోషించలేని పరిస్థితి ఆమెది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యేది.
ఈ సమస్యలతో తీవ్ర మనస్థాపం చెందిన తల్లి గోరుముద్దలు పెట్టాల్సిన చేతితోనే ముగ్గురు పిల్లలకు విషమిచ్చింది. వారు చనిపోయారని నిర్ధారించుకొన్నాక, ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటి చుట్టుపక్కల వారు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూసేసరికి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనను చూసిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం